
- ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటి వారంలో సమావేశాలు
- కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్లు, ఇతర కీలక అంశాలపై చర్చించే చాన్స్
- గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టం కోసం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
హైదరాబాద్, వెలుగు: ఈ నెల చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. త్వరలో రాష్ట్ర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి దీనిపై నిర్ణయం తీసుకోనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు.
ఇప్పటికే కమిషన్ తన రిపోర్ట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, లోపాలను ప్రస్తావించింది. ఈ నివేదికపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. రిపోర్ట్‌పై పూర్తిస్థాయిలో సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే.. చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బీసీ బిల్లు, పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ రాష్ట్రపతి దగ్గరే పెండింగ్‌లో ఉండిపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే దానిపై అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరుతూ తీర్మానం చేసే చాన్స్ ఉంది. ఆ తదుపరి స్థానిక ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం వారి హక్కులను, భద్రతను కాపాడటానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనికి సంబంధించిన బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకు సంబంధించిన అంశాలు, విద్య, వైద్య రంగాలపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలుస్తున్నది.