హైదరాబాద్, వెలుగు: తార్నాకలో శిథిలావస్థలో ఉన్న 65 ఏండ్ల నాటి ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలను నిర్మించాలనే ప్రతిపాదనను సర్కారుకు పంపించినట్టు విద్యా శాఖ హైకోర్టుకు తెలిపింది. దీనికి రూ.21 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పింది. విజయ డెయిరీ ఆవరణలోనే పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదన చేసినట్టు పేర్కొంది.
విజయ డెయిరీకి కేటాయించిన 42 ఎకరాల స్థలంలో పాఠశాల నిర్మాణానికి ఐదు ఎకరాలు కేటాయించాలని కోరుతూ గతేడాది వినతి పత్రం ఇచ్చినా స్పందన లేదంటూ కె. త్రిపుర సహా 9 మంది వేసిన పిటిషన్‌ను జస్టిస్ సుద్దాల చలపతిరావు గురువారం విచారించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. విజయ డెయిరీ ఆవరణలోనే పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు వెల్లడించారు. తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది.
