- ఆరుగురు మహిళలుసహా 91 మందికి ప్రభుత్వం క్షమాభిక్ష
- రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన జైళ్లశాఖ
- 38 మందికి పెట్రోల్ బంకుల్లో ఉద్యోగం, మహిళలకు కుట్టుమిషన్లు
హైదరాబాద్, వెలుగు: జీవితాంతం జైలులోనే మగ్గుతామనుకున్న ఆ ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో కలిసి జీవించేందుకు జైలు జీవితం నుంచి విముక్తి కల్పించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆరుగురు మహిళా ఖైదీలుసహా మొత్తం 91 మంది యావజ్జీవ ఖైదీలను మంగళవారం విడుదల చేసింది.
దీంతో గత10 ఏండ్లకు పైగా జైళ్లలోనే మగ్గుతున్న జీవిత ఖైదీలు వారివారి కుటుంబాలతో కలిసి సొంతూళ్లకు వెళ్లారు. కాగా, క్షమాభిక్షపై విడుదలైన ఖైదీల్లో 38 మందికి పెట్రోల్ బంకుల్లో ఉపాధి అవకాశం కల్పిస్తూ.. జైళ్లశాఖ వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేసింది. ఆరుగురు మహిళా ఖైదీల్లో నలుగురికి కుట్టు మిషన్లు అందించింది. వీటితో పాటు జైలులో పనిదినాలకు సంబంధించిన నగదు అప్పగించింది. ఈ మేరకు చర్లపల్లి సెంట్రల్ జైలులో నిర్వహించిన కార్యక్రమంలో జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా సహా ఐజీలు, డీఐజీలు, ఖైదీల కుటుం సభ్యులు పాల్గొన్నారు.
మళ్లీ జైలుకు రావొద్దు:డీజీ సౌమ్యమిశ్రా
ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. విడుదలవుతున్న ఖైదీలకు దిశానిర్దేశం చేశారు. శిక్షించడంతోపాటు మారే అవకాశం కల్పించడం కూడా కారాగార వ్యవస్థ లక్ష్యమని చెప్పారు. జైలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో గుర్తించాలని, జీవితంలో మళ్లీ ఎప్పుడూ జైలుకు రావొద్దన్నారు. ఒకవేళ రెండోసారి నేరం చేసి వస్తే క్షమాభిక్ష ఉండబోదని హెచ్చరించారు.
క్షమాభిక్ష అనేది.. జీవిత ఖైదీలకు సుప్రీంకోర్టు ఇచ్చిన వరం అన్నారు. విడుదల అనంతరం ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన, సార్థకమైన జీవితం గడపగలిగేలా పునరావాసం,ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మరో 53 మంది ఖైదీలు స్వయం ఉపాధి, వ్యవసాయం, కుటుంబ వ్యాపారాలు ఇతర వృత్తులను చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేయడంతో అందుకు అవసరమైన సహకారం అందిస్తామని డీజీ సౌమ్యమిశ్రా స్పష్టం చేశారు.
“క్షణికావేశంలో ఓ నేరం చేశాను. నాకు ముగ్గురు అమ్మాయిలున్నారు. కోర్టు జీవిత ఖైదు విధించడంతో 14 ఏండ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష ద్వారా నేను మళ్లీ నా కుటుంబ సభ్యులతో జీవించే అవకాశం లభించింది. మళ్లీ ఎప్పుడూ నేరం చేయను. క్షణికావేశంలో చేసిన తప్పుకు శిక్ష అనుభవించాను. పరివర్తన చెందాను. రాష్ట్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు’.
- పిట్టల నరేందర్, నిజామాబాద్
“ఇటుక బట్టీలో పనిచేసేవాడిని. అక్కడ నా భార్యతో జరిగిన గొడవలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు గత 12 ఏండ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాను. జైలులో ఉండగానే 2015లో బైపాస్ సర్జరీ జరిగింది. అందరికీ దూరమయ్యాను. ప్రభుత్వం క్షమాభిక్షపై విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నాకున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుని బతుకుతాను. జీవితంలో మళ్లీ నేరం చెయ్యను.’
- జన్ను సుదయ్య, పంది కుంట, ములుగు జిల్లా
‘‘నేను ట్రాక్టర్‌డ్రైవింగ్‌చేసే వాడిని. చిన్న గొడవలో ఒకరిపై దాడి చేశాను. 14 ఏండ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాను. నా జీవితం అంతా జైల్లోనే ముగుస్తుందని భయపడ్డాను. కానీ నా సత్‌ప్రవర్తన కారణంగా క్షమాభిక్ష లభించింది. నేను కోరుకునేది ఒక్కటే.. జైలు జీవితం శత్రువులకు కూడా రావొద్దు. తప్పులు చెయ్యొద్దు.. జైలుకు రావొద్దు. నేను కూడా ఎలాంటి నేరం చేయను. జైలు అధికారులు పెట్రోల్‌బంకులో ఉద్యోగం ఇచ్చారు. వచ్చిన జీతంతో జీవనం సాగిస్త.
- సంతోష్, భైంసా, నిర్మల్ జిల్లా
