- ముగ్గురు గిగ్ వర్కర్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
- సెక్రటేరియెట్లో చెక్కుల అందజేత
హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కార్మికుడి రక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు గిగ్ వర్కర్ల కుటుంబ సభ్యులకు బుధవారం సెక్రటేరియెట్‌లోని తన చాంబర్‌లో ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంత్రి అందజేశారు.
గిగ్ వర్కర్లు లోకుర్తి నరేశ్, జి.శ్యామ్ సుందర్, అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్ ఇటీవల మృతిచెందగా.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలకు తగ్గట్టుగా తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు అండగా నిలుస్తూ అసెంబ్లీలో గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ చట్టాన్ని ఆమోదించిందని తెలిపారు.
గిగ్ వర్కర్లకు రక్షణ, భద్రతా వలయం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. గిగ్ వర్కర్లు అయినా, హమాలీలు అయినా అందరికీ ప్రభుత్వం నుంచి తగిన సహాయం, రక్షణ అందాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గిగ్ వర్కర్ల యూనియన్ కీలక పాత్ర పోషించిందని, వారు కార్మిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ చర్యలను సాధ్యంచేశారని మంత్రి అభినందించారు.
ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గిగ్ వర్కర్లు, బలహీన వర్గాలను నిర్లక్ష్యం చేయదని, వారి హక్కులు, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ ఈ. గంగాధర్, గిగ్ వర్కర్ల యూనియన్ నాయకుడు సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సహాయం అందించి తమకు అండగా నిలిచిన సీఎంకు, మంత్రి వివేక్ వెంకటస్వామికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణ వేగవంతం చేయాలి..
దేశంలో రేర్ ఎర్త్ ఖనిజాలను గుర్తించడం, అన్వేషించడం, సమర్థంగా వినియోగించడం అత్యవసరమని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, హార్మూజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు భారత్ వంటి దేశాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు దృష్టి సారించాల్సిన పరిస్థితిని తెచ్చాయన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రేర్ ఎర్త్ ఖనిజాలు – ఎలక్ట్రిక్ వాహనాలు’జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగించారు.
యువ ఇంజినీర్లు రేర్ ఎర్త్ ఖనిజాల రంగంలో ముందడుగు వేయాలని, కొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు. రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణలో పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
రేర్ ఎర్త్ ఖనిజాల విషయంలో భారత్ తగినంతగా పరిశోధన చేయడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా జరుగుతున్న సాంకేతిక మార్పుల్లో రేర్ ఎర్త్ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కొత్త సాంకేతికతలో రేర్ ఎర్త్ ఖనిజాలు అత్యంత ముఖ్యమని, ఈ రంగంలో భారత్ మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర గనుల శాఖ ఇటీవల కొన్ని కీలక ఖనిజాల వెలికితీత కోసం ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇస్తోందని, ఇది శుభపరిణామమన్నారు. రేర్ ఎర్త్ ఖనిజాలను గుర్తించి, వాటిని వెలికితీసే ప్రక్రియలో ఆధునిక సాంకేతికతను జోడించాలని సూచించారు. దీంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, దేశీయంగా ఉత్పత్తి పెరిగి ఆర్థికంగా బలోపేతం అవుతామని ఆయన వివరించారు.
ఈ సదస్సు ద్వారా రేర్ ఎర్త్ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న రేర్ ఎర్త్ అన్వేషణలో భారత్ వాటా కేవలం 1 శాతం మాత్రమేనని, దేశం 6–7 శాతం వృద్ధిరేటును కొనసాగించాలంటే ఈ అన్వేషణను విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

