పాత పద్ధతిలోనే ఇంటర్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్లు

పాత పద్ధతిలోనే ఇంటర్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్లు
  • స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌లో విలీనం ప్రస్తుతానికి వాయిదా
  • హడావుడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది
  • అసెంబ్లీలో చర్చించాకే విలీనంపై తుది నిర్ణయం 
  • అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ప్రకటన

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్మిషన్లపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ విద్యాసంవత్సరం (2026–27) యథావిధిగా పాత పద్ధతిలోనే ఇంటర్ అడ్మిషన్లు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంటర్మీడియెట్‌‌‌‌ను స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌లో విలీనం చేసే ప్రక్రియను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండటం, విలీన ప్రక్రియలో అనేక టెక్నికల్ ఇష్యూస్ ఎదురవుతుండటంతో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఆదివారం హైదరాబాద్‌‌‌‌లో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం సెక్రటరీ అజిత్ రెడ్డి, విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా తదితరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్ అడ్మిషన్లు, విలీనంపై చర్చించారు. విలీనానికి సంబంధించి ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా పరమైన సమస్యలపై డిస్కస్ చేశారు. హడావుడిగా నిర్ణయం తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని భావించిన సీఎం.. ఈ ఏడాది పాత పద్ధతిలోనే ప్రవేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

సీబీఎస్‌ఈ తరహాలోనే రాష్ట్రంలో కూడా 11, 12 తరగతులను స్కూల్ ఎడ్యుకేషన్‌లో భాగంగానే నిర్వహించాలని గతంలో ప్రభుత్వానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సూచించింది. పదో తరగతి తర్వాత ఇంటర్ కాలేజీలు విడిగా ఉండటంతో.. సర్కారు స్కూళ్లలో చదివే మెజారిటీ విద్యార్థులు పైచదువులకు వెళ్లడం లేదని, దీంతో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని కమిషన్ పేర్కొంది. మెజారిటీ రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం అమలులో ఉండటంతో, మన దగ్గర మార్పులు చేయాలని సీఎం భావించారు.

అయితే, ఇటీవల అడ్మిషన్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటన చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. ఇంటర్ విలీనంపై ఇప్పుడే తొందరపడొద్దని, స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడాలని సూచించారు. తెలంగాణ ఎడ్యుకేష‌న్ పాల‌సీపై నియ‌మించిన క‌మిటీ అధ్యయనం చేసి దీనిపై నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. విద్యా విధానంపై వేసిన కమిటీ నివేదిక ఇచ్చాక, దానిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని, ఆ తర్వాతే విలీనంపై తుది నిర్ణయం తీసుకుందామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

సీఎం నిర్ణయంపై ఇంటర్ జేఏసీ హర్షం..

ఇంటర్ అడ్మిషన్లను ఈ ఏడాది యథావిధిగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఇంటర్ విద్యా జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్ రెడ్డి, ఇంటర్ బోర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగదీశ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, జేఏసీ నేతలు కళింగ కృష్ణకుమార్, బలరాం జాదవ్, కనకచంద్రం తదితరులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంటర్ విద్యా వ్యవస్థ రద్దు, పాఠశాల విద్యలో విలీనం వంటి అంశాలపై తొందరపడకుండా, స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం భరోసా ఇవ్వడాన్ని స్వాగతించారు. వివిధ రాష్ట్రాల్లోని విద్యా విధానాలు, మన ఇంటర్ విద్యా విధానం గొప్పతనాన్ని జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వానికి వివరించగా, సానుకూలంగా స్పందించిన సీఎం.. వ్యవస్థ ఉన్నతికి అండగా ఉంటానని హామీ ఇచ్చారని పి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో సహకరించిన కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డికి కూడా ధన్యవాదాలు తెలిపారు.