ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. వెయ్యి కోట్లు!

ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. వెయ్యి కోట్లు!

పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచి పోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు అందకపోవడంతో సేవలు నిలిపి వేసి, ఒత్తిడి పెంచాలని పలు ప్రైవేటు హాస్పిటళ్లు యోచిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌‌వర్క్‌‌లో 300కు పైగా ప్రైవేటు హాస్పిటళ్లు ఉన్నాయి. ఆయా దవాఖానలకు రోగి వెళ్లగానే.. రోగిపేరు, ఊరు, రోగం తాలూకు వివరాలన్నీ ఆన్‌ లైన్‌ లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌కు చేరుతాయి. హాస్పిటల్‌‌ అందించి నచికిత్స వివరాలను పరిశీలించి 40 రోజుల్లోపు ట్రస్ట్‌‌ బోర్డు నుంచి సదరు హాస్పిటల్‌‌కు నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ, కొంతకాలంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌ నుంచి ఆస్పత్రులకు నిధులు మంజూరు కావడంలేదు. అసలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌కే రెండున్నర నెలలుగా నిధులు అందడంలేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా, తాము ఏంచేయలేమని ట్రస్ట్‌‌ అధికారులు చెప్తున్నారు.

నెట్‌‌వర్క్‌‌ హాస్పిటళ్లకు సుమారు రూ.600 కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారులు అంటున్నారు. అయితే, రూ. వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నట్లు నెట్‌‌వర్క్‌‌ హాస్పిటల్స్‌‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెప్తున్నారు. పెద్ద పెద్ద ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లకు నిధులు ఆలస్యమైనా భరించే శక్తి ఉంటుంది. కానీ,కొన్ని హాస్పిటళ్ల అచ్చంగా ఆరోగ్యశ్రీ నిధులపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఇలాంటి దవాఖానలు సిబ్బంది జీతాలకు, మెయింటెనెన్స్‌‌కు డబ్బుల్లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

కోర్టుకు వెళ్లే యోచన
గతంలో బకాయిలు పేరుకుపోయినప్పుడు కొన్నిహాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగి కొంతమేర బకాయిలు విడుదల చేసింది. చివరగా గత ఏడాది డిసెంబర్‌‌‌‌లో హాస్పిటళ్లకు నిధులు మంజూరయ్యాయి. ఇక ఆ తర్వాత నుంచి బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి.ప్రతి నెలా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌కు విన్నవిస్తూనే ఉన్నామని, ఈసారి సేవలు నిలిపి వేస్తామని చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందనలేదని హాస్పిటల్స్​ యాజమాన్యాలు అంటున్నాయి. ప్రతిసారి ఇలా సేవలు నిలిపివేయడం, ప్రభుత్వాన్ని బతిమాలు కోవడంపై ఏమిటని అవి ప్రశ్నిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌, హాస్పిటల్స్‌‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. చికిత్స చేసిన 40 రోజుల్లో నిధులు విడుదల చేయాలని హాస్పిటల్స్‌‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. ఒప్పందంలోని ఈ నిబంధన ఆధారంగా కోర్టులో కేసు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.