- అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
- చదువుతో పాటే స్టైపెండ్..
- ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులకు దిగ్గజ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు
- ఏటీసీల్లో ఈవీ సర్వీసింగ్.. డ్రోన్ టెక్నాలజీ కోర్సులు
- శక్తి శాఖపై మంత్రి వివేక్‌తో కలిసి సీఎం సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే యువత, కార్మికులకు పాస్‌పోర్టులు ఇప్పించడం మొదలు అక్కడి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించే వరకు పూర్తి బాధ్యతను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్కిల్ కలిగిన మానవ వనరులను విదేశాలకు పంపే క్రమంలో వారికి లైట్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌తోపాటు అవసరమైన విదేశీ భాషల్లో శిక్షణ నివ్వాలని సూచించారు.
శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శాఖ (శక్తి శాఖ)పై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి కోసం గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్తూ దళారులు, ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బందులు పడుతున్నారని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇకపై అలాంటి అక్రమ ఏజెంట్ల నెట్‌వర్క్‌కు చెక్ పెడుతూ, విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరి డేటాను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. విదేశీ మ్యాన్‌పవర్ ఏజెన్సీలతో టామ్‌కామ్ ఒప్పందాలు చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్లిన తెలంగాణ వాసులకు ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వమే నేరుగా చర్చలు జరిపి న్యాయం చేయడానికి వీలుంటుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పారదర్శకంగా పర్యవేక్షించేందుకు విదేశీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని సీఈవోగా నియమిస్తున్నట్టు ప్రకటించారు.
స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా అత్యాధునిక రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లో తెలంగాణ యువతకు ప్రాధాన్యత పెరిగేలా జర్మన్, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్‌లాంటి విదేశీ భాషలను నేర్పించేందుకు స్కిల్ వర్సిటీలో ఒక ఫారిన్ లాంగ్వేజ్ వింగ్ నెలకొల్పాలని సూచించారు.
విద్యార్థులకు ఆయా భాషల్లో నిష్ణాతులైన స్థానిక నిపుణులతోపాటు విదేశాల నుంచి శిక్షకులను రప్పించి అత్యుత్తమ ట్రైనింగ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే నిరుపేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్న తరహాలోనే.. విదేశాల్లో బ్లూ కాలర్ (రహదారి, నిర్మాణ, సాంకేతిక) ఉద్యోగాల కోసం నైపుణ్య శిక్షణ పొందే నిరుపేద యువతకు సైతం స్కాలర్‌షిప్‌లు అందించే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, హరితహారంలో భాగంగా స్కిల్ వర్సిటీలో రీ-లొకేటెడ్ (పెద్ద) చెట్లను విస్తృతంగా నాటాలని పిలుపునిచ్చారు.
ఏటీసీల్లో ఈవీ సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో (ఏటీసీ) చదివే విద్యార్థులకు చదువుతో పాటే ప్రముఖ పారిశ్రామిక కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే వెసులుబాటు కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. దీంతో విద్యార్థులకు కోర్సు చదువుతున్నప్పుడే స్టైఫండ్ లభించడమే కాకుండా, భవిష్యత్తులో వారు చేయబోయే ఉద్యోగానికి అవసరమైన హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వేగంగా అబ్బుతుందని అభిప్రాయపడ్డారు.
మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఏటీసీల్లో విద్యుత్ వాహనాల (ఈవీ) వాడకం పెరిగిన దృష్ట్యా ‘ఈవీ సర్వీసింగ్’ కోర్సులతో పాటు వ్యవసాయం, ఇతర రక్షణ రంగాల్లో విరివిగా ఉపయోగపడుతున్న ‘డ్రోన్ టెక్నాలజీ’పై ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ రంగానికి భవిష్యత్తులో విపరీతమైన డిమాండ్ ఉన్నందున విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
డిమాండ్‌కు తగ్గట్టుగా నర్సింగ్ కాలేజీలు
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ నర్సింగ్ సేవలకు అత్యంత భారీగా డిమాండ్ ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో ప్రతి ఇంటికీ ఒక నర్స్ అవసరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ఈ అంతర్జాతీయ డిమాండ్‌ను రాష్ట్ర యువత అందుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా నాణ్యతా ప్రమాణాలతో కూడిన నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఉదారంగా అనుమతులు ఇస్తుందని చెప్పారు. మన రాష్ట్రంలో నాణ్యమైన నర్సింగ్ విద్యను అభ్యసించిన అభ్యర్థులకు విదేశాల్లో విరివిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
ప్రతిపాదిత నిర్ణయాలను వెంటనే క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేలా పక్కా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని శక్తి శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, శక్తి శాఖ కార్యదర్శి హరిచందన, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నిర్మలా కాంతి వెస్లీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సుబ్బారావు పాల్గొన్నారు.
