గోదావరిలో 967 టీఎంసీలు మావే:జీఆర్ఎంబీకి తెలంగాణ లెటర్

గోదావరిలో 967 టీఎంసీలు మావే:జీఆర్ఎంబీకి తెలంగాణ లెటర్

హైదరాబాద్, వెలుగు: గోదావరి నదిలో నీటి లభ్యతను సెంట్రల్  వాటర్  కమిషన్  (సీడబ్ల్యూసీ) తన నివేదికలో తక్కువగా చూపించిందని, తమ రాష్ట్రానికి 967.94 టీఎంసీలు దక్కుతాయని తెలంగాణ తేల్చిచెప్పింది. ఇరిగేషన్​ ఈఎన్సీ (జనరల్) మురళీధర్​ శనివారం గోదావరి రివర్  మేనేజ్ మెంట్  బోర్డ్ (జీఆర్ఎంబీ) చైర్మన్​ ఎంకే సిన్హాకు ఈ మేరకు లేఖ రాశారు. 

గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్​ఇటీవల ఇచ్చిన నివేదికలో సబ్​బేసిన్​ల వారీగా నీటి లభ్యత తక్కువగా చూపించారని ఆయన తెలిపారు. జీ10 (కాళేశ్వరం వద్ద ప్రాణహిత కలిసే సంగమ ప్రాంతం నుంచి ఇంద్రావతి సంగమం వరకు) నీటి లభ్యతలో 28.84 టీఎంసీలు తక్కువగా చూపించారని ఆయన పేర్కొన్నారు.

 జీ10 సబ్​ బేసిన్​లో 287.18 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టులను ఇప్పటికే నిర్మించారని, 126.64 టీఎంసీల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ‘‘8.88 టీఎంసీలను భవిష్యత్తులో చేపట్టాల్సి ఉంది. 12.20 టీఎంసీలు థర్మల్​ప్రాజెక్టుల వాటాగా ఉంది. మొత్తంగా ఈ సబ్​బేసిన్​లో ప్రాజెక్టులకు 434.91 టీఎంసీలు కేటాయించారు. కానీ, సీడబ్ల్యూసీ స్టడీలో నీటి లభ్యతను తక్కువగా చూపించారు. ” అని మురళీధర్  పేర్కొన్నారు.