V6 News

ఎన్‌‌వోసీ సమర్పించాక  పాస్‌‌పోర్టు మంజూరు చేయండి

ఎన్‌‌వోసీ సమర్పించాక  పాస్‌‌పోర్టు మంజూరు చేయండి
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌ పిటిషన్‌‌పై హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌‌ క్రిమినల్‌‌ కేసులకు సంబంధించి కింది కోర్టు జారీ చేసిన ఎన్‌‌వోసీని సమర్పించాక దాన్ని పరిశీలించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌‌‌కు చట్ట ప్రకారం పాస్‌‌పోర్టు మంజూరు చేయాలంటూ పాస్‌‌పోర్టు అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌‌వోసీ కోసం అడ్లూరి కింది కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని, దీనిపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆ కోర్టును ఆదేశించింది. పలు క్రిమినల్‌‌ కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయన్న కారణంగా పాస్‌‌పోర్టు జారీని పాస్‌‌పోర్టు అథారిటీ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మంత్రి అడ్లూరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన జస్టిస్‌‌ నగేశ్‌‌ భీమపాక ఉత్తర్వులు జారీ చేస్తూ క్రిమినల్‌‌ కేసులు పెండింగ్‌‌లో ఉన్నంత మాత్రాన పాస్‌‌పోర్టు జారీకి అడ్డంకి కాదని, దీనికి సంబంధించి ఇదే హైకోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు. కేసులు పెండింగ్‌‌లో ఉన్న దిగువ కోర్టు నుంచి పిటిషనర్ ఎన్‌‌వోసీ పొందలేదని, దాని కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.  పిటిషనర్‌‌ ఎన్‌‌వోసీ సమర్పించాక చట్టప్రకారం పాస్‌‌పోర్టు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. విదేశాలకు వెళ్లాలనుకుంటే కింది కోర్టులో దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సిందేనని స్పష్టం చేస్తూ పిటిషన్‌‌పై విచారణను ముగించారు.