ప్రైవేటు స్థలంలో 24 గంటల్లో బోర్డును తొలగించండి : హైకోర్టు

ప్రైవేటు స్థలంలో 24 గంటల్లో బోర్డును తొలగించండి : హైకోర్టు
  • సాహెబ్‌‌ నగర్‌‌ కేసులో హైడ్రాకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: చట్టాన్ని అనుసరించకుండా ప్రైవేటు స్థలంలో పెట్టిన బోర్డును 24 గంటల్లో తొలగించాలంటూ హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేపట్టకుండా ప్రైవేటు స్థలంలో బోర్డులు ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. హయత్‌‌నగర్‌‌ మండలం సాహెబ్‌‌నగర్‌‌ కలాన్‌‌లో ప్లాట్‌‌ 40లో హైడ్రా బోర్డు ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ ఝాన్సీ అనే మహిళతోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు ఏకపక్షంగా బోర్డులు ఏర్పాటు చేశారన్నారు. గతంలో ఇదే ప్లాటుకు సంబంధించిన వివాదంలో నిర్మాణ అనుమతులను జీహెచ్‌‌ఎంసీ ఉపసంహరించడంతోపాటు హైడ్రా జారీ చేసిన కూల్చివేత నోటీసులను హైకోర్టు రద్దు చేసిందన్నారు.

ఒకవేళ అది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఏదైనా చర్యలు తీసుకోదలిస్తే నోటీసులు ఇచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించినా దానికి విరుద్ధంగా బోర్డుఏర్పాటు చేశారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి బోర్డును  తొలగించి పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు.