హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలోని సర్వే నంబర్లు 3, 5లో ఉన్న 28.6 ఎకరాల భూమికి సంబంధించి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కంచె ఏర్పాటు సహా అన్ని చర్యలను నిలిపివేయాలని సూచించింది. గుర్రంగూడకు చెందిన రైతు జక్కిడి యాదిరెడ్డి సహా మరో ముగ్గురు దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ జరిపారు.
పిటిషనర్ల తరపు న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. 1989–-90లో నమోదైన అమ్మకపు పత్రాల ద్వారా భూమిని కొనుగోలు చేసి మూడు దశాబ్దాలుగా సాగు చేస్తున్నామని, హైడ్రా అధికారులు అక్రమంగా గేట్లు కూల్చి ఫెన్సింగ్ వేసి, తమను భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ అడ్వకేట్ సు దర్శన్‌రెడ్డి వాదిస్తూ.. ఈ భూమి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న 650 ఎకరాల్లో భాగమని, పిటిషనర్లు యాజమాన్యాన్ని నిరూపించే చెల్లుబాటు పత్రాలు సమర్పించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ వరకు బలవంతపు చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది.
