నోటీసులు లేకుండా హైడ్రా కూల్చివేతలా..హైకోర్టు ఆగ్రహం

నోటీసులు లేకుండా హైడ్రా కూల్చివేతలా..హైకోర్టు ఆగ్రహం
  • తప్పుడు సమాచారం ఇచ్చారెందుకు? 
  • వ్యక్తిగత హాజరు కావాలని శేరిలింగంపల్లి తహసీల్దార్‌‌కు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు హైడ్రాను నిలదీసింది. హైదరాబాద్‌‌ కొండాపూర్‌‌లోని ఓ ప్రైవేటు స్థలంలో కాంపౌండ్ వాల్‌‌, వాచ్‌‌మెన్‌‌ గదిని కూల్చివేయడంపై విచారణ చేపట్టిన కోర్టు.. చర్యలు తీసుకునే ముందు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో హైడ్రాకు తప్పుడు సమాచారం ఎలా ఇచ్చారో వివరించాలని శేరిలింగంపల్లి తహసీల్దార్‌‌ను హైకోర్టు ఆదేశించింది.

ఈనెల 30న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌‌లోని సర్వే నంబర్‌‌ 60లో ఉన్న 350 చదరపు గజాల స్థలంలోని కాంపౌండ్‌‌, వాచ్‌‌మెన్‌‌ గదిని హైడ్రా కూల్చివేసింది. దీనిని సవాలు చేస్తూ పెమ్మసాని సుధారాణి హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. దీనిపై జస్టిస్‌‌ ఎన్‌‌.వి.శ్రవణ్‌‌ కుమార్‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది ఎస్‌‌.శ్రీధర్‌‌ వాదిస్తూ.. సుధారాణి రిజిస్టర్‌‌ సేల్‌‌డీడ్‌‌ ద్వారా స్థలం కొనుగోలు చేశారని తెలిపారు.

ఆ తర్వాత ప్రభుత్వం కూడా స్థలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయితే ఈ స్థలం ప్రభుత్వ భూమి అంటూ అప్పట్లో తహసీల్దార్‌‌ అభ్యంతరం చెప్పారని, దీంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. సర్వే అండ్‌‌ సెటిల్‌‌మెంట్‌‌ శాఖ చేసిన సర్వేలో సర్వే నంబర్‌‌ 59 ప్రభుత్వ భూమి అని, సర్వే నంబర్‌‌ 60 పట్టా భూమి అని తేలిందన్నారు.

ప్రైవేటు స్థలంలో నిర్మాణాలకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని, ఏదైనా చర్య తీసుకోవాలంటే ముందుగా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని కోర్టు గతంలో ఆదేశించిందని చెప్పారు. అయినా వాటిని పట్టించుకోకుండా హైడ్రా, తహసీల్దార్‌‌ కూల్చివేతలు చేపట్టారని వాదించారు. హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తహసీల్దార్‌‌ ఇచ్చిన సమాచారంతోనే చర్యలు తీసుకున్నామని తెలిపారు.

వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. చర్యలు తీసుకునే ముందు నోటీసులు ఇవ్వాలని చెప్పినా ఎందుకు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారో శేరిలింగంపల్లి తహసీల్దార్‌‌ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు.