హైదరాబాద్, వెలుగు: ఆధారాల్లేని ఆరోపణలతో కక్షిదారులు కోర్టులను తప్పుదోవపట్టిస్తున్నారని చెబుతున్నారుగానీ, వాస్తవంగా తప్పుదోవ పట్టిస్తున్నది అధికారులు, ప్రభుత్వ శాఖలేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకుండా చర్యలు చేపడుతున్నారని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులున్నా కూల్చివేతలు చేపడుతూ అత్యుత్సాహం చూపుతున్నారని మండిపడింది. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకుండా పోవడంతో ప్రైవేటు వ్యక్తులకు చెందిన కాంపౌండ్ కూల్చివేతకు గురైందని తెలిపింది.
ఎలాంటి నిర్ధిష్ట ఆదేశం లేకుండా కూల్చివేతలు చేపట్టడంలో హైడ్రా అత్యుత్సాహం చూపిందని, హైడ్రా వ్యవహారంలో ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సమర్థనీయమేనని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో సర్వేనెం.60లో ఉన్న 350 చదరపు గజాల ప్లాట్ కాంపౌండ్‌తోపాటు వాచ్‌మెన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ పెమ్మసాని సుధారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్. శ్రీధర్ వాదనలు వినిపిస్తూ సర్వే నెం.59లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి తహసీల్దార్ గత ఏడాది అక్టోబరు 1న కలెక్టర్‌కు లేఖ రాశారన్నారు. అప్పటికే ఉన్న నిర్మాణాలను తొలగించడానికి సహకరించాలంటూ పోలీసు కమిషనర్‌కు కలెక్టర్ అక్టోబరు 3న లేఖ రాయడంతోపాటు అదే కాపీని హైడ్రాకు పంపారని చెప్పారు. అదే నెల 4న పిటిషనర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హైడ్రా కూల్చివేసిందన్నారు. ఇదే భూవివాదానికి సంబంధించి 2022లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోలేదని వాదించారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు తేదీలవారీగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 6కు వాయిదా పడింది.
