అమీన్‌‌‌‌పూర్‌‌‌‌లో ఇండ్ల కూల్చివేతపై కౌంటర్ ఇవ్వండి..హైడ్రాకు హైకోర్టు ఆదేశం..విచారణ 15కు వాయిదా

అమీన్‌‌‌‌పూర్‌‌‌‌లో ఇండ్ల కూల్చివేతపై కౌంటర్ ఇవ్వండి..హైడ్రాకు హైకోర్టు ఆదేశం..విచారణ 15కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: అమీన్‌‌‌‌పూర్‌‌‌‌లో చేపట్టిన 28 ఇండ్ల కూల్చివేతలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైడ్రాతోసహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ.. విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. పట్టా భూమిలో వేసిన ఫెన్సింగ్‌‌‌‌ను తొలగించి, అక్కడ మళ్లీ ఇండ్లను నిర్మించుకునేందుకు అనుమతివ్వాలని దాఖలైన పిటిషన్‌‌‌‌పై జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం విచారణ చేపట్టారు.

పిటిషనర్ల తరఫున న్యాయవాది రామవరం చంద్రశేఖర్ రెడ్డి వాదిస్తూ..పిటిషనర్లు 2013లోనే లే-అవుట్‌‌‌‌లో  స్థలాలను కొనుగోలు చేశారని కోర్టుకు తెలిపారు. ఆ భూమిపై వివాదం రావడంతో 2022లోనే హైకోర్టు ‘యథాతథ స్థితి (స్టేటస్‌‌‌‌కో)’ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ ఆదేశాలు అమల్లో ఉండగానే, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు. శనివారం సాయంత్రం నోటీసు ఇచ్చి, మరుసటి రోజు ఆదివారం ఉదయమే 28 ఇండ్లను కూల్చివేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అక్కడ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ అధికారులే అన్ని అనుమతులు ఇచ్చారని.. కరెంట్, తాగునీటి కనెక్షన్లు కూడా మంజూరు చేశారని వివరించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆక్రమణ జరిగినట్లు తేలితే క్రమబద్ధీకరణ ఫీజు కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, ఇండ్ల పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే తుది ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేశారు.