విచారణ ఖైదీ ఆత్మహత్యపైనివేదిక ఇవ్వండి..పోలీసులకు హైకోర్టు ఆదేశం 

విచారణ ఖైదీ ఆత్మహత్యపైనివేదిక ఇవ్వండి..పోలీసులకు హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: జనగామ జిల్లా జైలులో విచారణ ఖైదీ మల్లయ్య ఆత్మహత్యపై సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని జైళ్లశాఖ, పోలీసు అధికారులను హైకోర్టు ఆదేశించింది. జైలు అధికారులపై ఎలాంటి తప్పు లేకపోతే విచారణకు అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన వరాల హిమ దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్ మాధవీదేవి విచారించారు.

జైలులో తన భర్తతో మరుగుదొడ్లు శుభ్రం చేయించడం వంటి పనులు చేయించి అవమానించడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని, కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం మంజూరు చేయాలని పిటిషనర్ తరఫున న్యాయవాది రఘునాథ్ వాదించారు. ఘటనకు బాధ్యులైన జైలు అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.  

మేజిస్ట్రేట్ విచారణ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయలేదని, వారి ప్రమేయం లేకుండానే విచారణను ముగించారని చెప్పారు. భర్తను కోల్పోయిన పిటిషనర్ ఇద్దరు పిల్లలతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్ ఆరోపణలపై జైళ్లశాఖ ఐజీ స్వతంత్ర విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. తదుపరి విచారణ ఈ నెల 28కు వాయిదా వేశారు.