నిజామాబాద్‌ మహిళ హత్య కేసులో జీవిత ఖైదు రద్దు

నిజామాబాద్‌ మహిళ హత్య కేసులో జీవిత ఖైదు రద్దు
  • ప్రత్యక్ష సాక్ష్యాలు, సరైన ఆధారాలు లేవని తేల్చిన హైకోర్టు
  • నేరాభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం
  • నిందితుడిని తక్షణం విడుదల చేయాలని జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్‌లో పానీపూరి వ్యాపారి భార్య హత్య కేసులో రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్‌కు కింది కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేసింది. కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలు లేవని తెలిపింది. నేరం ఎంత తీవ్రమైనదైనా నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పైనే ఉందని న్యాయమూర్తులు జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ బి.ఆర్‌.మధుసూదన్‌రావుల డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. 

పానీపూరి వ్యాపారంలో సాయానికి వచ్చిన మంగీలాల్‌ను 2017 జులైలో యజమాని పచ్చి బఠానీల కోసం ఇంటికి పంపాడు. అక్కడ దివ్యాంగురాలైన యజమాని భార్యపై అతను లైంగికదాడికి ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించి కేకలు వేసింది. దీంతో భయపడి రోకలితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఫిర్యాదుదారు సోదరి ఇంటికి వెళ్లి, ముగ్గురు దాడి చేశారని అబద్ధం చెప్పాడు. కత్తితో తనను తాను గాయపరచుకుని ఆధారాలు సృష్టించాడు. ఫోన్ ద్వారా సమాచారం అందడంతో అందరూ కలిసి బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

హైకోర్టు తీర్పు... దర్యాప్తు లోపాలు

భర్త ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయగా, కింది కోర్టు పరిస్థితుల ఆధారంగా 2018 ఏప్రిల్‌లో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ మంగీలాల్‌ హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. నిందితుడు ఇంటికి వెళ్లడం, ఆందోళనగా ఉండటం వంటి కారణాలతోనే శిక్ష విధించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. కేసు దర్యాప్తులో వేలి ముద్రలు సేకరించకపోవడం, రక్తపు నమూనాలు పరీక్షించకపోవడం వంటి లోపాలున్నాయని తప్పుపట్టింది. 

ఘటన అనంతరం నిందితుడు పారిపోకుండా బాధితురాలిని ఆస్పత్రికి తరలించేటప్పుడు ఉన్నాడనే విషయాన్ని కింది కోర్టు విస్మరించిందని చెప్పింది. భిన్నాభిప్రాయాలు ఉన్నపుడు నిందితుడివైపే మొగ్గు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేసింది. ఇతర కేసులేవీ లేకపోతే మంగీలాల్‌ను తక్షణం విడుదల చేయాలని నిజామాబాద్‌ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.