హైదరాబాద్: లోతుకుంట భూములపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హైడ్రా తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. హైడ్రా కమిషనర్పై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ, నీటిపారుదల చట్టాలు కాకుండా హైడ్రా చట్టమొకటి ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది.
హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారిందని ధర్మాసనం మండిపడింది. ఒకే భూమికి సంబంధించి మూడు కోర్టు ధిక్కరణ పిటీషన్లలో ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టు చరిత్రలో లేదని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
కోర్టు ధిక్కరణ ఉత్తర్వుల్లో అప్పీలు చేయకుండా మళ్లీ ఆ స్థలంలోకి వెళ్లడం తీవ్ర నేరమన్న హైకోర్టు స్పష్టం చేసింది. లోతుకుంట భూముల్లో సాధారణ ఫిర్యాదును తీసుకొని కోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా వెళ్లడమేంటని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలుకు ఏజీ సమయం కోరారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని వివాదాస్పద భూమికి సంబంధించి.. సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమిలో జులై 17న హైడ్రా చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
గత విచారణలో పిటిషనర్ భూమిలోకి వెళ్లబోమని హైడ్రా హామీ ఇచ్చినప్పటికీ, అనంతరం అధికారులు మళ్లీ అక్కడికి వెళ్లి పునరుద్ధరణ పనుల్లో జోక్యం చేసుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది హరీశ్‌కుమార్ కోర్టుకు తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి ఫొటోల్లో హైడ్రా వాహనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, తేదీ, సమయం కూడా నమోదైందని పేర్కొన్నారు. ఇది కోర్టు ఉత్తర్వుల ప్రత్యక్ష ఉల్లంఘనేనని అన్నారు.
ALSO READ : 1870లోనే హైదరాబాద్ పారిశ్రామికీకరణకు శ్రీకారం
కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు అమల్లో ఉండగా ప్రైవేటు భూమిలోకి ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు.
