హైదరాబాద్, వెలుగు: తనపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని, టీవీ చానల్ ఏర్పాటు చేస్తానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, రూ.5 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసులు విచారణ చేపట్టకుండా కేసు నమోదు చేశారని వాదించారు. తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదు చేశారని, నాలుగేళ్ల కింద జరిగినట్లు చెబుతున్న ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 5న జస్టిస్ మధుసూదన్‌రావు విచారణ చేపట్టనున్నారు.
