- విడాకుల అంశంలో భార్య అప్పీల్‌ను కొట్టివేసిన ధర్మాసనం
హైదరాబాద్, వెలుగు: 15 ఏండ్లు విడివిడిగా ఉంటున్నారంటే వివాహ బంధం పూర్తిస్థాయిలో విచ్ఛిన్నమైనట్లేనని హైకోర్టు స్పష్టం చేస్తూ విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే దిగువ కోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తున్నట్లు తేల్చిచెప్పింది. భార్య వేధింపులు భరించలేకపోతున్నానని, తనతో కాపురం చేయడంలేదంటూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై నిజామాబాద్ కుటుంబ న్యాయస్థానం 2014లో విడాకులు మంజూరు చేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ భార్య దాఖలు చేసిన అప్పీలుతోపాటు శాశ్వత భరణం కోరిన దరఖాస్తును హైకోర్టు ఇటీవల విచారించి అప్పీల్‌ను కొట్టివేసింది. 2011 నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటున్న భార్య దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని హైకోర్టు గుర్తుచేసింది. చట్టంలో క్రూరత్వం అన్న పదానికి స్పష్టమైన నిర్వచనం లేదని, అది కేవలం కేసు పరిస్థితుల ఆధారంగానే నిర్ధారించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు పంచాయతీలు, రాజీ చర్చలు జరిగినా భార్య అంగీకరించలేదని, ఈ నేపథ్యంలో విడాకుల డిక్రీలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇక రూ.50 లక్షల శాశ్వత భరణం ఇప్పించాలన్న అప్పీలుదారు వాదనకు తగిన ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. భార్యాభర్తల ఆదాయం, ఆస్తులు, అప్పులు, ఆర్థిక స్థితిగతులతో కూడిన అఫిడవిట్లు సమర్పించిన తర్వాతే దిగువ కోర్టు భరణాన్ని నిర్ణయిస్తుందని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇక్కడ మంజూరు చేయలేమని స్పష్టం చేస్తూ కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
