హైదరాబాద్, వెలుగు: ఆస్పత్రుల్లో బయో మెడికల్ వ్యర్థాల సేకరణకు సంబంధించి రాష్ట్ర పీసీబీ జారీ చేసిన కొత్త బిల్లింగ్ విధానాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. నిపుణులైన నియంత్రణ అధికారులు రూపొందించిన విధానంలో న్యాయ సమీక్ష జోక్యం పరిమితమేనని పేర్కొంది. నియంత్రణ అధికారులు తీసుకొచ్చిన బిల్లింగ్ విధానం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే తప్ప జోక్యం చేసుకోలేమని పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. అయితే, నిర్ధిష్ట కాలవ్యవధిలో బిల్లింగ్ విధానాన్ని సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర పీసీబీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆస్పత్రుల్లో బయో మెడికల్ వ్యర్థాల శుద్ధి, సేకరణకు సంబంధించి కేంద్ర పీసీబీ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర పీసీబీ గతేడాది జూన్ 4న జారీ చేసిన సర్క్యూలర్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ ఆస్పత్రులు, నర్సింగ్ హోం అసోసియేషన్ (తానా) తదితరులు కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశాయి. దీనిపై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

