- వీసీల మీటింగ్‌లో విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా, మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూనివర్సిటీల రూపురేఖలు మార్చేందుకు, చదువుల క్వాలిటీ పెంచేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఫోకస్ పెట్టింది. దీనికి అనుగుణంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో టీజీసీహెచ్‌ఈ ఆఫీసులో వీసీల సమావేవం జరిగింది. దీనికి కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా, కళాశాల విద్యా శాఖ సెక్రటరీ శ్రీదేవసేన తదితరులు పాల్గొని, వర్సిటీలకు దిశానిర్దేశం చేశారు. ముందుగా అన్ని యూనివర్సిటీలు తాము చేసే ప్లాన్‌ను ప్రజెంట్ చేశారు.
ఈ సందర్భంగా యోగితా రాణా వంద రోజుల ప్లాన్‌పై వివరించారు. స్టూడెంట్లు ప్రపంచ స్థాయి కాంపిటీషన్‌ను తట్టుకునేలా ఉండాలని, అందుకే ‘ఫ్యూచర్ రెడీ తెలంగాణ-2047’లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. దీని కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.కేవలం సిలబస్ పూర్తి చేయడం మాత్రమే కాదని, స్టూడెంట్లలో సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరగాలని స్పష్టం చేశారు.
ఈ 100 రోజుల ప్లాన్‌ను ఒక మిషన్ మోడ్‌లో అమలు చేయాలని ఆదేశించారు. పాత కాలం పద్ధతులు పక్కనబెట్టి, క్లాసుల్లో లేటెస్ట్ టెక్నాలజీ వాడాలని ఆమె సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్, హైబ్రిడ్ లెర్నింగ్ మెథడ్స్ వాడి పాఠాలు చెప్పాలని తెలిపారు. డిగ్రీ చదివే ప్రతి స్టూడెంట్ కచ్చితంగా ఇంటర్న్‌షిప్ చేసేలా ‘యూనిఫైడ్ ఇంటర్న్‌షిప్ గ్రిడ్’ను ఏర్పాటు చేయాలని, దీంతో చదువు అయిపోగానే సలభంగా జాబ్ వస్తుందని వెల్లడించారు. .
అడ్మిషన్లు పెంచాలి: బాలకిష్టారెడ్డి
వచ్చే విద్యా సంవత్సరం నాటికి వర్సిటీల్లో అడ్మిషన్లు పెంచడం, స్టూడెంట్ల డ్రాపౌట్స్ తగ్గించడం పైనే ప్రధానంగా దృష్టి పెట్టామని టీజీసీహెచ్‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. రీసెర్చ్ కోసం ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ఏర్పాటు చేయడంతో పాటు కార్పొరేట్ కంపెనీల సాయం తీసుకునేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అన్ని యూనివర్సిటీల్లో ఒకేసారి అడ్మిషన్లు.. పరీక్షలు ఉండేలా కామన్ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయించారు.
