V6 News

వీధి కుక్కల దాడులపై హెచ్ఆర్సీ సీరియస్

వీధి కుక్కల దాడులపై హెచ్ఆర్సీ సీరియస్
  • రెండు మరణాలపై సుమోటోగా కేసు స్వీకరణ

అబిడ్స్, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న వీధి కుక్కల దాడుల ఘటనలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్‌‌‌‌‌‌‌‌గా స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా రెండు మరణాల ఘటనలను సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించింది. కమిషన్ చైర్మన్ డాక్టర్​ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో దివ్య బేహ్రా అనే మూడేళ్ల చిన్నారి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ర్యాకం నాగరాజు(36) వీధి కుక్కల దాడిలో మృతిచెందారు.

ఈ ఘటనలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఆర్టికల్ 21 కింద ఉన్న జీవించే హక్కుకు భంగం కలిగించేలా ఈ ఘటనలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఇందులో స్థానిక సంస్థల నిర్లక్ష్యాన్ని కూడా కమిషన్ పరిశీలిస్తోంది. ప్రజల భద్రతతో పాటు వలస కార్మికుల పరిస్థితిపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదికను జూన్ 2లోగా సమర్పించాలని పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.