హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గుర్తింపు లేకుండా అక్రమంగా నడుస్తున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఇంటర్ బోర్డు సెక్రెటరీ అభిలాష అభినవ్ హెచ్చరించారు. అఫిలియేషన్ లేని కాలేజీల్లో చేరి విద్యార్థులు తమ విలువైన భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని సూచించారు. ఏదైనా కాలేజీలో చేరేముందు ఆ సంస్థకు బోర్డు గుర్తింపు ఉందో.. లేదో అధికారిక మార్గాల ద్వారా సరిచూసుకోవాలని తెలిపారు. గురువారం ‘అనుమతి ఒకచోట.. కాలేజీ మరోచోట’ అనే హెడ్డింగ్ తో వెలుగులో వచ్చిన కథనంపై ఇంటర్ బోర్డు అధికారులు స్పందించారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాలేజీలపై చర్యల కోసం ఇంటర్ బోర్డు టాస్క్ ఫోర్స్ బృందాలతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టినట్టు పేర్కొన్నారు. యాజమాన్యాల తీరును బట్టి రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు భారీ జరిమానాలు విధించినట్టు వివరించారు. భవిష్యత్‌లోనూ ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాప్రమాణాలు పాటించని కాలేజీలపై ఇంటర్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
