- నిమిషం నిబంధనతో స్టూడెంట్స్‌ను ఇబ్బంది పెట్టొద్దు
- ఇంటర్, టెన్త్ పరీక్షలపై సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు
- పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
- ప్రతి సెంటర్ వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచన
- కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
- నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25 నుంచి ఇంటర్, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నాయని, పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. పరీక్షలు ప్రారంభమైన తర్వాత 5 నిమిషాల వరకు విద్యార్థులు వచ్చినా లోపలికి అనుమతించాలని, నిమిషం నిబంధన పేరుతో ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గతంలో మాల్ ప్రాక్టీస్, గొడవలు జరిగిన సమస్యాత్మక సెంటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టి, విజిలెన్స్ నిఘా పెంచాలని.. ప్రతి సెంటర్ వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సౌకర్యాల విషయంలో అస్సలు రాజీ పడొద్దని, ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చొని పరీక్ష రాయకుండా అన్ని సెంటర్లలో బెంచీలు వేయాల్సిందేనని తెలిపారు.
ప్రతి ఎగ్జామ్ సెంటర్‌లో తాగునీరు, కరెంట్, టాయిలెట్స్, సీసీ కెమెరాలను కచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి సెంటర్‌లో ఒక ఏఎన్ఎం, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యాశాఖ అధికారులే కాకుండా.. ఇతర శాఖల ఆఫీసర్లతో సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి, కాపీయింగ్‌కు చెక్ పెట్టాలని, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలపైనా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎస్ ఆదేశించారు.
ప్రతి క్వశ్చన్ పేపర్‌పై క్యూఆర్ కోడ్: యోగితా రాణా
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4,89,055 మంది, సెకండియర్ పరీక్షలకు 4,53,832 మంది, టెన్త్ ఎగ్జామ్స్‌కు 5,28,239 మంది హాజరుకానున్నారని విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా వెల్లడించారు. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీకేజీలను అడ్డుకునేందుకు ప్రతి క్వశ్చన్ పేపర్ పై క్యూఆర్ కోడ్, సీరియల్ నెంబర్ ఉంటుందని తెలిపారు. ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి 15 నిమిషాల ముందే పేపర్ ఓపెన్ చేయాలని చెప్పారు. సెంటర్లలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించబోమని వెల్లడించారు. ఈసారి స్టూడెంట్ల హాల్ టికెట్లను నేరుగా వాట్సాప్ ద్వారా పంపడమే కాకుండా, వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. పరీక్షల నిర్వహణలో ఏవైనా అవకతవకలు జరిగితే సంబంధిత ఆఫీసర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు అటెండ్ కానున్న 9.97 లక్షల మంది
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 సెంటర్లను ఏర్పాటు చేశారు. కాగా.. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
ప్రతి సెంటర్‌ను సీసీ కెమెరాలతో బోర్డు కంట్రోల్ రూమ్‌కు లింక్ చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉండి అన్ని సెంటర్లను సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఇక నిర్ణీత టైమ్‌కు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉన్నా.. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సూచించారు. ఈసారి మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీములు, 200 సిట్టింగ్ స్క్వాడ్ టీములను సిద్ధం చేశామన్నారు.
