- నిర్మాణ బాధ్యతలు హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగింత
- రూ.245 కోట్లతో 109 నూతన భవనాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని 30 జిల్లాల్లో నూతనంగా తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు బాధ్యతలు అప్పగించింది. సాధారణంగా ప్రభుత్వ భవనాల నిర్మాణ బాధ్యతలను ఇంజినీరింగ్ శాఖలైన ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, ట్రైబల్, పబ్లిక్ హెల్త్ శాఖలకు ఇస్తుంటారు.
అయితే, ఆ శాఖలకు ఇస్తే భవన నిర్మాణ పనులు ఆలస్యమవుతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా 99 తహసీల్దార్, 10 ఆర్డీవో ఆఫీసుల నిర్మాణానికి ఆదివారం హౌసింగ్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. టెండర్ దాఖలుకు వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. ఒక్కో ఆఫీసును ఎకరం నుంచి రెండు ఎకరాల విస్తీర్ణంలో, 8,000 ఎస్‌ఎఫ్‌టీలో రూ.2.25 కోట్లతో నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం దేశాలు జారీ చేసింది.
స్థలాలు స్వాధీనం చేసుకున్న కార్పొరేషన్..
రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే స్థలాలు ఖరారయ్యాయి. కాగా, వీటిని రెవెన్యూ శాఖ నుంచి హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా, నిర్ణీత గడువులోపు పనులు పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను హౌసింగ్ కార్పొరేషన్ ఎస్ఈ, డీఈలకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అద్దె భవనాల్లో కార్యాలయాలు..
తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం పెద్ద ఎత్తున కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే వాటికి సొంత భవనాలు నిర్మించకపోవడంతో చాలా ఆఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న భవనాలు చాలావరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో కొత్తగా భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
