తక్కువ అప్పులున్న రాష్ట్రాల్లో తెలంగాణది నాలుగో ప్లేస్
కిందటేడాది రూ.8,400 కోట్ల అప్పు కట్టినం
వచ్చే ఏడాది కట్టాల్సింది రూ. 26 వేల కోట్లే
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, వెలుగు:దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అప్పులు తక్కువేనని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంటే.. కాంగ్రెస్ పాలిత పంజాబ్ ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో రెండో ప్లేస్‌లో ఉందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే అప్పులు తీసుకున్నామని.. అప్పు, వడ్డీ కలిపి కిందటేడాది రూ.8,492 కోట్లే చెల్లించామని వివరించారు. రాష్ర్ట సర్కారు చేస్తున్న అప్పుల విషయంలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బడ్జెట్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సోమవారం అసెంబ్లీలో మంత్రి సమాధానమిచ్చారు. అవసరాన్ని బట్టి ఆర్‌బీఐ నుంచి చేబదులు తీసుకునే వెసులుబాటు ఉందని, ఏడాది కాలంలో రూ. 36 వేల కోట్లు తీసుకుని వారం, పది రోజుల్లోనే చెల్లించామని చెప్పారు. దీన్ని కూడా అప్పుల కిందే లెక్కగట్టారన్నారు. భట్టి చెబుతున్నట్టు వచ్చే ఏడాది రాష్ర్టం కట్టాల్సిన అప్పు రూ. 50 వేల కోట్లు కాదని, రూ. 26,624 కోట్లేనని స్పష్టం చేశారు.
తలసరి వ్యయంలో తెలంగాణ సెకండ్
ఆరేండ్లలో విద్య కోసం రూ.96,220 కోట్లు ఖర్చు చేశామని, ఇది మొత్తం బడ్జెట్‌లో 14.15 శాతమని వివరించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊళ్లలో ఒక్క పూట కూడా కరెంట్ సరిగా ఉండేది కాదని, ఇప్పుడు 24 గంటలు ఉంటోందని చెప్పారు. ఆరేండ్ల కింద రాష్ర్ట తలసరి ఆదాయం రూ.1,24,104 ఉంటే ఇప్పుడు రూ.2,27,145కు పెరిగిందని తెలిపారు. దేశ తలసరి ఆదాయం రూ.1,27,768 మాత్రమే ఉందన్నారు. తలసరి వ్యయంలో దేశంలో గోవా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా తెలంగాణ సెకండ్ ప్లేస్‌లో ఉందని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగం దేశ సగటు కన్నా తక్కువే ఉందన్నారు. ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు కేటాయించామని, దీన్ని బట్టే ప్రభుత్వ రంగ సంస్థలపై తమ వైఖరి స్పష్టమవుతోందని చెప్పారు.
మూసీ ప్రక్షాళనకు మస్తు పైసలు
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే ఎక్కువ అప్పులు చేశాయని హరీశ్‌రావు తెలిపారు. బడ్జెట్‌పై మండలిలో రెండ్రోజులు జరిగిన చర్చలో 13 మంది సభ్యులు ప్రస్తావించిన అంశాలకు మంత్రి జవాబిచ్చారు. విద్య, ఆర్‌అండ్‌బీ, వైద్య రంగాలకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని సభ్యులు లేవెనత్తిన విషయాన్ని ప్రస్తావిస్తూ బడ్జెట్‌ను అర్థం చేసుకోవాలన్నారు. విద్యకు కేటాయింపులు విద్యా శాఖ పరిధిలోనే లేవని.. సంక్షేమ, వ్యవసాయ, ఉద్యానవన, అటవీ శాఖల ద్వారా కూడా ఉన్నాయని వివరించారు. మూసీ ప్రక్షాళనకు భారీగా నిధులు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీలన్నీ అప్పులు కావని చెప్పారు. కొత్త జిల్లాలకు డీఈవోలు లేరని టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రస్తావించగా.. సిద్దిపేట జిల్లా కూడా కొత్తదేనని, డీఈవో ఉన్నారని హరీశ్ తెలిపారు. కొత్తగా మైనింగ్ పాలసీ తెస్తున్నామన్నారు. తర్వాత సభను చైర్మన్ శుక్రవారానికి వాయిదా వేశారు.
