రికార్డులు ఉన్న పనులకే నిధుల విడుదల!

రికార్డులు ఉన్న పనులకే నిధుల విడుదల!
  • గత సర్పంచ్‌‌‌‌ల పెండింగ్‌‌‌‌ బిల్లుల చెల్లింపునకు సర్కారు మార్గదర్శకాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో గత సర్పంచ్‌‌‌‌ల హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్‌‌‌‌ బిల్లుల చెల్లింపుపై పంచాయతీరాజ్‌‌‌‌ శాఖ స్పష్టతనిచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌‌‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌‌‌‌ దివ్యా దేవరాజన్‌‌‌‌ ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవో) కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 2023 =-24 ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీలకు టైడ్‌‌‌‌ కాంపొనెంట్‌‌‌‌ కింద రూ.245 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే, 2024-=25 సంవత్సరానికి సంబంధించి బేసిక్‌‌‌‌ అన్‌‌‌‌టైడ్‌‌‌‌, టైడ్‌‌‌‌ గ్రాంట్ల కింద రూ.640.07 కోట్లు కేటాయించింది. ఈ నిధుల నుంచి గత సర్పంచ్‌‌‌‌ల కాలంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

అయితే, ఇందుకు షరతులు విధించింది. గత సర్పంచ్‌‌‌‌ల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన నేపథ్యంలో.. వారు చేపట్టిన తాగునీరు, పారిశుధ్య పనులకు సంబంధించి రికార్డులు పక్కాగా అందుబాటులో ఉన్న పక్షంలోనే నిధులు విడుదల చేయాలని సూచించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బిల్లులను క్లియర్ చేయాలని ఆదేశించారు. అలాగే, గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న మల్టీ పర్పస్‌‌‌‌ వర్కర్లకు పంచాయతీల వద్ద అందుబాటులో ఉన్న నిధుల నుంచి వారికి తక్షణమే వేతనాలు చెల్లించాలని సూచించారు.