భూముల రీసర్వేపై నిర్లక్ష్యం వద్దు..గడువులోగా 2,240 గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

భూముల రీసర్వేపై నిర్లక్ష్యం వద్దు..గడువులోగా 2,240 గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి
  • ప్రతి సర్వే నంబర్‌కు  భూదార్ కేటాయిస్తూ భూభారతిలో నమోదు చేయాలి
  • నక్షా లేని 373 గ్రామాల్లో సర్వేకు ముందస్తు నోటీసులు తప్పనిసరి అని వెల్లడి

హైదరాబాద్,  వెలుగు: భూముల రీ-సర్వే పనులను అధికారులు, సిబ్బంది ప్రాధాన్యతగా తీసుకొని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో రెవెన్యూ, సర్వే శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రీ-సర్వే జరుగుతున్న గ్రామాల్లో పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించడం, ప్రతి సర్వే నంబర్‌కు భూదార్ గుర్తింపు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భూమి రైతులకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది వారి కుటుంబ జీవనాధారమని అన్నారు. రీ-సర్వేపై రైతులు, భూ యజమానులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

2,240 గ్రామాల్లో కొనసాగుతున్న రీ-సర్వే..

రాష్ట్రంలో తొలి దశలో భాగంగా జిల్లాకు 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో అధికారులు అందుబాటులో ఉండి, భూముల హద్దుల విషయంలో రైతులు, ప్రజలకు ఉన్న అనుమానాలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. రీ-సర్వే పనులను ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి వారం జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించాలని చెప్పారు.

డీజీపీఎస్‌, జీఐఎస్‌ టెక్నాలజీతో సర్వే..

భూముల హద్దులను కచ్చితంగా గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్​), రోవర్స్‌, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వంటి టెక్నాలజీతో శాస్త్రీయ పద్ధతిలో కొలతలు తీసుకుంటున్నామని చెప్పారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక డిజిటల్ భూదార్ నంబర్ కేటాయించి, భూ భారతి పోర్టల్‌లో నమోదు చేస్తామని తెలిపారు. దీని వల్ల భూముల యాజమాన్య హక్కులపై స్పష్టత వస్తుందని చెప్పారు. నకిలీ రిజిస్ట్రేషన్లు, భూ వివాదాలకు కూడా చెక్ పడుతుందని తెలిపారు.

నక్షా లేని 373 గ్రామాల్లో ప్రత్యేక చర్యలు

రాష్ట్రంలో మ్యాప్స్ (నక్షా) లేని 373 గ్రామాల్లో కూడా రీ-సర్వే కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఆయా గ్రామాల్లో పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నక్షా లేని గ్రామాల్లో సర్వే ప్రారంభించే ముందు సంబంధిత పట్టాదారులకు తప్పనిసరిగా ముందస్తు నోటీసులు ఇవ్వాలని చెప్పారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములను స్పష్టంగా గుర్తించాలని, గ్రామకంఠం హద్దులను ప్రాథమికంగా నిర్ణయించిన తర్వాతే ప్రధాన సర్వే పనులు మొదలు పెట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారి పూర్తి సంతృప్తి వచ్చేలా రీ-సర్వే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.