- ఎమ్మార్వో ఆఫీసు, మీ సేవా కేంద్రాల్లో పొందొచ్చు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పౌరులు, వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏ సంస్థ, ఏ వ్యవస్థ అడిగినా అందించేందుకు వీలుగా ప్రభుత్వం ‘ఫ్యామిలీ సర్టిఫికెట్ ’ అందిస్తున్నది.
ఈ సర్టిఫికెట్ జారీ ప్రారంభమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉండి, సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ, ఇతర ప్రభుత్వ పథకాలను పొందుతున్న వారి వివరాలన్నింటినీ ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన ‘సర్’ అవగాహన సదస్సులో భట్టి విక్రమార్క మట్లాడారు.
రాష్ట్రంలోని ఏ పౌరుడైనా తమ కుటుంబ సభ్యుల సమాచారం కావాలనుకుంటే తహసీల్దార్ ఆఫీస్‌లోగానీ, మీసేవా కేంద్రానికి వెళ్లిగానీ ఈ ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ పొందొచ్చని చెప్పారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ అన్ని చోట్లా చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, వివిధ అధికారిక అవసరాలు, కుటుంబ వివరాలను సమర్పించాల్సిన సందర్భాల్లో ఈ ధ్రువపత్రం కీలకంగా మారనుందని తెలిపారు.
ఇప్పటివరకు కుటుంబ వివరాల ధ్రువీకరణ కోసం ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడంతోపాటు ప్రజలకు సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.
