గుడ్ న్యూస్.. పేద విద్యార్థినులకు పైలట్ శిక్షణ..ఇంటర్ విద్యాశాఖ, ఇండిగోరీచ్ ఎంవోయూ

గుడ్ న్యూస్.. పేద విద్యార్థినులకు పైలట్ శిక్షణ..ఇంటర్ విద్యాశాఖ, ఇండిగోరీచ్ ఎంవోయూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పేద విద్యార్థినుల పైలట్ కలను సాకారం చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ కీలక అడుగు వేసింది. పేద అమ్మాయిలను ఏవియేషన్ రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఇండిగోరీచ్, భారత్ కేర్స్ సంస్థలతో ఎంవోయూ కుదిరింది. మంగళవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ ఒప్పంద పత్రాలపై ఆయా సంస్థల ప్రతినిధులు, ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ సంతకాలు చేశారు. 

‘గివింగ్ వింగ్స్ టు ఫ్లై’ పేరుతో చేపట్టిన ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపికైన విద్యార్థినులకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) శిక్షణ ఇస్తారు. ఇందులో ఏటీఆర్ టైప్ రేటింగ్‌‌‌‌తో కూడిన శిక్షణ ఉంటుంది. సుమారు 20 నెలలపాటు సాగే ఈ కోర్సు కాలంలో విద్యార్థినులకు వసతి, భోజన సౌకర్యాలు, మెడికల్ ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితంగా కల్పిస్తారు. దీంతోపాటు అనుభవజ్ఞులైన పైలట్ల ద్వారా మెంటార్‌‌‌‌షిప్, కెరీర్ గైడెన్స్ కూడా అందించనున్నారు. ఈ సందర్భంగా అభిలాష అభినవ్ మాట్లాడుతూ తెలంగాణలోని యువతులకు ఇది గొప్ప అవకాశమన్నారు. 

దరఖాస్తు విధానం..

విద్యార్థినులు అధికారిక పోర్టల్ indigoreachgwf.scholarsbox.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇంటర్ కళాశాలల నెట్‌‌‌‌వర్క్ ద్వారా ఈ సమాచారాన్ని విద్యార్థినులకు చేరువ చేయనున్నట్లు తెలిపారు.  ఇంటర్ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం. వెంక్యానాయక్, ఎస్ఐవీఈ  ప్రిన్సిపాల్ జ్యోత్స్నరాణి, భారత్ కేర్స్ ప్రతినిధి సి. సాయి పాల్గొన్నారు.