ఎలక్షన్లు రాంగనే సెంటిమెంటు ఎగేస్తున్నారు

ఎలక్షన్లు రాంగనే సెంటిమెంటు ఎగేస్తున్నారు

 

  • ఏపీ సీఎం జగన్​ను మరోసారి తిట్టిన మంత్రులు
  • తండ్రిని మించిన దుర్మార్గుడంటూ ఫైర్​

పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం, రాయలసీమ(సంగమేశ్వరం) లిఫ్ట్ స్కీమ్ పనులపై రెండుమూడు వారాలుగా మంత్రులు మండిపడుతున్నారు. శ్రీశైలంలో ఎడమ గట్టు జల విద్యుత్​ కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి ఆపించాలంటూ ఏపీ సీఎం జగన్మోహన్​రెడ్డి ప్రధానమంత్రికి లెటర్ రాయడంపై మంత్రులు జగదీశ్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​, నిరంజన్​రెడ్డి శుక్రవారం స్పందించారు. వైఎస్ జగన్ .. తండ్రి వైఎస్​ రాజశేఖర్ రెడ్డిని మించిన దుర్మార్గుడని.. కోర్టును కూడా మోసం చేసిన చరిత్ర ఉన్న ఆయన ఇప్పుడు ప్రధానికి లేఖల పేరుతో ఏపీ ప్రజలను వంచిస్తున్నాడని మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్రా నేతలే వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని.. తాము అట్ల చేయాలనుకుంటే నిమిషం పని అని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఫైర్ ​అయ్యారు. శ్రీశైలం డ్యామ్​లో నీళ్లన్నీ మళ్లించుకునేలా పెద్దపెద్ద కాలువలు తవ్వుతున్నరని.. మన నీళ్లు మలుపుకపోతున్నరని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వం రెండేండ్ల కింద సంగమేశ్వరం లిఫ్ట్ కోసం ఏపీ జీవో ఇచ్చినప్పడు, ఆరు నెలల కింద పనులు ప్రారంభించినప్పడు మంత్రులంతా ఒక్క మాట మాట్లాడలేదు. త్వరలో హుజూరాబాద్​కు బైఎలక్షన్ ఉండడంతో ఎన్నికల వ్యూహంలో భాగంగానే సెంటిమెంట్ ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మన నీళ్లు ఎత్తుకపోతున్నరు

హైదరాబాద్‌‌, వెలుగు: సీఎం కేసీఆర్‌‌కు పేరు వస్తదనే కాంగ్రెస్‌‌, బీజేపీ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారని, వారికి తెలంగాణ ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేదని మంత్రి నిరంజన్‌‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మినిస్టర్స్‌‌ క్వార్టర్స్‌‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం జాతీయ పార్టీలకు పట్టదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద కేసులు వేసిన కాంగ్రెస్‌‌, బీజేపీ నేతలు ఆంధ్రా అక్రమ ప్రాజెక్టుల మీద ఒక్క కేసు ఎందుకు వేయలేదన్నారు. ప్రధానికి లేఖ రాయడంతో సమస్య పరిష్కారం అవుతుందా అని ఏపీ సీఎం జగన్‌‌ను ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏపీ సర్కారు తన చర్యలను సరిదిద్దుకోవాలన్నారు. తెలంగాణది ధర్మ పోరాటమని, హక్కుల కోసమే కొట్లాడుతున్నామని చెప్పారు. పులిచింతలలో కరెంట్‌‌ ఉత్పత్తిపై మాట్లాడే వాళ్లకు 60 ఏండ్లలో తెలంగాణ పడ్డ గోస ఎందుకు కనబడలేదని ప్రశ్నించారు. శ్రీశైలంను ఖాళీ చేసేందుకు 300 మీటర్ల వెడల్పుతో కాలువలు తవ్వుతున్నారని, దీంతో పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. 854 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని మళ్లించుకున్నప్పుడు, 800 అడుగుల వద్ద రాయలసీమ ఎత్తిపోతల చేపట్టినప్పుడు తాము 808 అడుగుల వద్ద కరెంట్‌‌ ఉత్పత్తి చేస్తే ఎలా తప్పవుతుందన్నారు. శ్రీశైలం కట్టిందే కరెంట్‌‌ ఉత్పత్తి కోసమన్నారు. గతంలో తెలంగాణ తాగునీటి అవసరాలను లెక్క చేయడకుండా కృష్ణా డెల్టా కోసం శ్రీశైలంలో కరెంట్‌‌ ఉత్పత్తి చేసిన విషయం మరిచారా అని ప్రశ్నించారు.  పరీవాహక ప్రాంతం ఆధారంగా కృష్ణాలో తెలంగాణకు 500 టీఎంసీలకు పైగా దక్కాల్సి ఉందన్నారు. బచావత్‌‌ అవార్డులో కేటాయించిన నీటి వాటా మేరకే జోగుళాంబ బ్యారేజీ, భీమా వరద కాలువ తవ్వాలని ప్రతిపాదించామన్నారు.

తండ్రిని మించిన దుర్మార్గుడు

సూర్యాపేట, వెలుగు: ఏపీ సీఎం వైఎస్ జగన్.. తండ్రి వైఎస్​ రాజశేఖర్ రెడ్డిని మించిన దుర్మార్గుడు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. కోర్టును కూడా మోసం చేసిన చరిత్ర ఉన్న ఆయన ఇప్పుడు ప్రధానికి లేఖల పేరుతో ఏపీ ప్రజలను వంచనకు గురిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించిందే ఆంధ్రా ప్రభుత్వమేనని.. వారు సృష్టించిన సమస్యకు పరిష్కారం కనుగొనాలని దుయ్యబట్టారు. కృష్ణా జలాలపై ఏపీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణా నదిని దోచుకుపోయే పద్ధతుల్లో తండ్రి రాజశేఖర్ రెడ్డి దుర్మార్గానికి పాల్పడ్డారని ఆయన విరుచుకుపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడం,పోతిరెడ్డిపాడును వెడల్పు చేయడం వంటి ఏకపక్ష నిర్ణయాలతో జగన్ తండ్రిని మించిపోయారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసమైతే.. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇతర అవసరాల కోసం జీవోలు వచ్చాయంటూ ఏపీ నేతలు చిలకపలుకులు పలుకుతున్నారన్నారు. ఉమ్మడి ఏపీలో ఏనాడైనా తెలంగాణ అవసరాల కోసం ఒక్కటి అంటే ఒక్క జీవో వచ్చిందా అని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు నేరుగా చర్చలు జరిపినప్పుడు జగన్ ​తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ప్రధానికి లేఖ రాశారని ఎద్దేవాచేశారు. తెలంగాణకు అన్యాయం చేసే పనులకు స్వస్తి పలికి అక్రమ నిర్మాణాలకు పుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు.

ఏపీ నేతలే రెచ్చగొడుతున్నరు

హైదరాబాద్‌‌, వెలుగు : నీటి కేటాయింపుల్లేని అక్రమ ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి ఎట్లా తీసుకువస్తారని మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ అన్నారు. ఏపీ సీఎం జగన్‌‌ కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం జల విద్యుత్‌‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులపై కేంద్ర బలగాలు మోహరించాలని జగన్‌‌ అనడం వెనుక సంగమేశ్వరం నుంచి దృష్టి మళ్లించే కుట్ర దాగి ఉందన్నారు. అన్నింటినీ కేంద్రం వద్ద పరిష్కరించుకుందామని జగన్‌‌ అంటున్నాడంటే ఏదో అనుమానం కలుగుతుందన్నారు. తాము కడుపు మండి మాట్లాడుతున్నామని, ఏపీ నేతలే వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని, తాము అలా చేయాలంటే నిమిషం పని అని అన్నారు. హైదరాబాద్‌‌లో ఉంటున్న సీమాంధ్రులపై జగన్‌‌ ఆవేదన చెందాల్సిన అవసరం లేదని, వాళ్లంతా ఇక్కడి వాళ్లేనని అన్నారు. ఉద్యమ సమయంలోనే సీమాంధ్రులను సెటిలర్లు అనలేదని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తమవాళ్లు బలిదానాలు చేశారు తప్ప సీమాంధ్రులపై ఎలాంటి ఘటనలు జరగలేదన్నారు. తెలంగాణ నిర్మిస్తున్న వాటిలో ఒక్క అక్రమ ప్రాజెక్టు లేదన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై మోడీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడలేదా అని, దీనిపై ప్రధాని న్యాయం చేయాలన్నారు. దీనికోసం ప్రధానిని కలుస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులకు జీవోలు ఇచ్చారని, అంటే అవన్నీ తప్పని జగన్‌‌ చెప్తున్నారా అని ప్రశ్నించారు. జగన్‌‌ కోరినట్టుగా ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవొద్దని, దీనిపై కేంద్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ఏపీ ప్రభుత్వం నీటి కేటాయింపుల ప్రకారమే ప్రాజెక్టులు కడుతామంటే తమ ఇంజనీర్లు కూడా సహకరిస్తారని అన్నారు. కృష్ణా నీటిని శాస్త్రీయంగా పంపకాలు చేయాలని కోరితే సుప్రీం కోర్టులో కేసు విత్‌‌ డ్రా చేసుకోమని కేంద్రం చెప్పిందన్నారు. జగన్‌‌ కూడా కేసు విత్‌‌ డ్రా చేసుకుందామని అపెక్స్‌‌ కౌన్సిల్‌‌లో ఒప్పుకున్నారని గుర్తు చేశారు.