ఎల్‌‌నినోపై మంత్రుల రివ్యూ..ప్రత్యామ్నాయ పంటలపై చర్చ

ఎల్‌‌నినోపై మంత్రుల రివ్యూ..ప్రత్యామ్నాయ పంటలపై చర్చ
  • సీఎం ఆదేశాలతో ఎమ్మెల్యేలు, 
  • ఎమ్మెల్సీలు నియోజకవర్గాల బాట
  • రేపు కొడంగల్  నియోజకవర్గంలో ‘సర్’పై రేవంత్‌‌ సమీక్ష

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం ఆదేశాలతో ఉమ్మడి జిల్లాల వారీగా వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు, సాగు పురోగతి, ప్రత్యామ్నాయ పంటల సాగు, విత్తనాల లభ్యత, రైతులకు అవగాహన తదితర అంశాలపై ఇన్‌‌చార్జి మంత్రులు సోమవారం సమీక్షలు నిర్వహించారు.

ఆదిలాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్‌‌కు సీతక్క, కరీంనగర్‌‌కు తుమ్మల నాగేశ్వర్‌‌‌‌ రావు, మెదక్‌‌కు వివేక్ వెంకటస్వామి, రంగారెడ్డికి శ్రీధర్ బాబు, మహబూబ్‌‌నగర్‌‌కు దామోదర రాజనర్సింహ, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, వరంగల్‌‌కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మంకు వాకిటి శ్రీహరి ఇన్‌‌చార్జి మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో వారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, స్పెషల్ ఆఫీసర్లతో కలిసి జిల్లా కలెక్టర్లు, అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారు.

సోమవారం మంత్రులు వివేక్,   లక్ష్మణ్ తదితరులు ఎల్‌‌నినో ఎఫెక్ట్‌‌పై వారివారి జిల్లాల్లో రివ్యూ నిర్వహించారు. ఖమ్మంలో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ రావు నిజామాబాద్‌‌లో రివ్యూలో పాల్గొన్నారు. వ్యవసాయం, నీటి పారుదల, రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా జిల్లాల వారీగా వర్షపాతం, సాగు విస్తీర్ణం, చెరువులు, -రిజర్వాయర్లలో నీటి లభ్యత, విత్తనాలు, ఎరువుల నిల్వ లు, విద్యుత్ సరఫరా, పంటల పురోగతి వంటి క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు.

ఎక్కువ నీరు అవసరమయ్యే వరికి బదులు తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలు సాగు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను మంత్రులు ఆదేశించారు. 

బోసిపోయిన గాంధీభవన్​

రాష్ట్రంలో సర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నియోజకవర్గాల బాట పట్టారు. వచ్చే నెల 3 వరకు ఏ ఒక్క నేత కూడా గాంధీ భవన్ వద్ద కనబడవద్దని, నియోజకవర్గాలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సోమవారం పార్టీ ఆఫీసు బోసిపోయి కనిపించింది. కార్యాలయ సిబ్బంది మినహా, ఏ ఒక్క లీడర్ కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదు.

నిత్యం లీడర్ల ప్రెస్ మీట్లతో హడావుడిగా కనిపించే గాంధీ భవన్‌‌లో సోమవారం ఏ ఒక్క నేత ప్రెస్ మీట్ జరగలేదు. నిత్యం విప్‌‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రెస్‌‌మీట్లతో హోరెత్తే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆఫీసు వద్ద కూడా ఎలాంటి సందడి కనిపించలేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా తన నియోజకవర్గమైన కొడంగల్‌‌లో బుధవారం సర్‌‌‌‌పై సమీక్ష చేయనున్నారు.