బండ్రు విమల తెలంగాణ ఉద్యమ కాలంలో తను అరుణోదయ బృందానికి నాయకురాలిగా పాడిన పాటల వల్ల విమలక్కగా మారింది. ఇది ఆమెకు తెలంగాణ ఇచ్చిన ఒక బిరుదు. అరుణోదయ సంస్థతో వ్యక్తిగతంగా నాకు సంబంధం లేదు. ఈ దేశంలో మార్క్కిస్ట్–లెనినిస్ట్ విప్లవం జయప్రదంకాదని నేను 1986లో నిర్ణయించుకుని నా మిత్రుడు ఉ. సాంబశివరావుతో కలిసి బయటకొచ్చిన తరువాత నేను ఆ సిద్ధాంతం పనిచేస్తున్న సంస్థలతోగాని, పార్టీలతోగాని ఏ రకమైన సంబంధాలు పెట్టుకోలేదు. అందువల్ల ఆమెతో నాకు వ్యక్తిగత పరిచయం ఎప్పుడూ అంత దగ్గరగా లేదు. 2025లో ఆమె ఫోన్ చేసి వేములవాడలో మేం ఒక లైబ్రరీ కట్టించాం మీరు దాన్ని ఇనాగరేట్ చెయ్యాలి అంటే నేను సరే వస్తాను అన్నాను.
తరువాత రెండు రోజులకే మీరు ఇజ్రాయెల్–పాలస్తీనా మీద రాసిన వ్యాసంతో మాకు విభేదాలు ఉన్నాయి. అందువల్ల మేం మా ఆహ్వానాన్ని విరమించుకుంటున్నాం అనే పద్ధతిలో మేసేజ్ చేసింది. నేను షాక్ తిన్నాను. అంతటితో అది ముగిసింది. ఎక్కడో ఉన్న పాలస్తీనా– ఇజ్రాయెల్ మీద నా అధ్యయనంతో నేను రాసిన వ్యాసంతో విభేదాలు ఉన్నాయని పిలిచి– వద్దన్న సిద్ధాంత ఫండమెంటల్ సంస్థ సాంస్కృతిక దళ నాయకురాలికి కొంత తటపటాయించి నేను ఈ వ్యాసం రాస్తున్నాను. అదీ స్వయంగా విమల తన 50వ పాటల సంవత్సరం సందర్భంగా అడిగింది కనుక. వ్యక్తిగతంగా విమలఅంటే నాకు చాలా గౌరవం. అదే ఆ పార్టీలో ఏదో పురుష నాయకుని మీద అయితే నేను రాసేవాడిని కాదు. విమలక్కతో సంస్థాగతంగా నేను టీ–మాస్‌తో కలిసి సమావేశాల్లో పాల్గొన్నాను. ఆ తరువాత బీఎల్‌ఎఫ్ అధ్యక్షునిగా కలిసి మీటింగుల్లో కలిసేవాళ్లం. ‘సామాజిక స్మగ్లర్లు–కోమటోళ్లు’ పుస్తకంపై, నాపై
చంద్రబాబు ప్రభుత్వం దాడికి దిగినప్పుడు (2017లో) విమల చంద్రబాబుకు వ్యతిరేక ఉద్యమంలో కూడా పాల్గొన్నది. అది నేను మర్చిపోలేను.
విమలక్క పాటలు
నేను విమలక్క పాటలు వినడం యూట్యూబ్ ప్రచారంలోకి వచ్చిన తరువాతనే. అంతకుముందు ఎక్కడో ఒకచోట, ఏదో ఒక మీటింగ్‌లో నేను స్పీకర్‌గా పోయినప్పుడు (అదీ ఇతర ప్రజాస్వామ్య వేదిక మీద) స్టేజ్‌మీద పాడగా విన్నాను. తెలంగాణ ఉద్యమ కాలంలో నేను వారి ధూంధాం కార్యక్రమంలోగాని, లేదా ఇతర తెలంగాణ మీటింగ్‌లో వినలేదు. ఎందుకంటే నేను కేసీఆర్ ఎంట్రీ తరువాత ఆ ఉద్యమాన్ని సిద్ధాంతరీత్యా బలంగా వ్యతిరేకించాను. అది భూస్వాములకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టే ఉద్యమం అని నాడు నా అంచనా. అది చివరికి ఏమైందో ఇప్పుడు చరిత్ర.
ఎక్కువసార్లు విన్న పాట
ఆమె పాడిన పాటలలో నన్ను ఎక్కువసార్లు వినేటట్టు చేసింది జార్జిరెడ్డిమీద పాడిన పాట. జార్జిరెడ్డి ఒక స్కాలర్. పోరాట యోధుడు. ఆయన ఏబీవీపీ వారితో వీరోచితంగా పోరాడి, పోరాడి అంతే పట్టుదలతో ఆ కొద్ది గంటల్లోనే ఉస్మానియా లైబ్రరీలో అండర్ గ్రౌండ్‌లో బుక్ ర్యాకుల మధ్య విపరీతంగా చదివేవాడు అని నేను 1974లో ఉస్మానియాలో చేరినప్పటి నుంచి విన్నాను, చదివాను. ఆ తరువాత నేను పీడీఎస్‌యూ అభిమానిగా మీటింగ్‌ల్లో, ఊరేగింపులో పాల్గొన్నాను కనుక ఆ వ్యక్తిమీద అభిమానం. విమల ఆ పాటను పాడిన విధానం నన్ను మళ్లీ మళ్లీ వినేటట్లు చేసింది. ఇప్పటికీ వింటూనే ఉంటాను. జార్జిరెడ్డి కూర్చొని పుస్తకాలు చదివినచోటే నేను ఎన్నో రోజులు తరబడి పుస్తకాలు చదివాను. అందువల్ల జార్జిరెడ్డి పాట నన్ను చాలా ఆకర్షించింది. దాన్ని రాసింది బహుశా మిత్ర అయి ఉంటాడు.
జార్జిరెడ్డి అమర్ రహేగా
‘మందారాల మకరందం.. అరవిందాల ప్రతిబింబం.. చీకటిపైన వేకువచందం.. ఆకలి కడుపున ఆర్తనాదం..జార్జిరెడ్డి అమర్ రహేగా’ ఈ పాటకు కట్టిన బాణితోపాటు ఆమె కంఠంలోని రాగం ఆ పాటకు మరింత విలువను తెచ్చింది. ఈ వ్యాసం రాసేనాటికి ఒక మిలియన్‌సార్లు ప్రజలు ఈ పాటను విన్నారు. దీన్ని విన్నవాళ్లెవరూ రైట్‌వింగ్ రాజకీయాలకు చెందినవారై ఉండరు. వాళ్లకు జార్జిరెడ్డి పేరు వింటేనే రెండు రకాల కోపాలు రగులుకొస్తాయి. ఒకటి అది ఒక క్రిస్టియన్ పేరు. అందులోనూ రెడ్డి కులానికి చెందినతను అని అక్రోశం పెరుగుతుంది. అదే అతను ఒక దళిత్ అయిఉంటే అంత కోపం రాదు. కానీ ప్రజాస్వామ్యవాదులు, కమ్యూనిస్ట్ రాజకీయాలతో, లేదా సోషలిస్టు సిద్ధాంతాలతో పరిచయం, అనుబంధం ఉన్నవాళ్లు, గొప్పగా మేధావితనాన్ని ప్రేమించేవాళ్లు, ఈ పాట విని ఆయన జీవిత చరిత్ర చదవాలని తపనపడడం సహజం.
‘ఎవరో ఒకరు, ఎప్పుడో అప్పుడు పుడతారులే..
నాకు నచ్చిన ఆమె రెండోపాట ‘ఎవరో ఒకరు, ఎప్పుడో అప్పుడు పుడతారులే.. మళ్లీ, మళ్లీ’. నర్సంపేట పాత తాలూకాలోని గూడూరు (మండలం)లో దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ సభకు పోయిన సందర్భంలో ఈ పాటను సీపీఐ (ఎంఎల్) నాయకుడు మిత్ర రాశాడని ఆమె చెబితే విన్నప్పుడు నాకు కొంత ఆశ్చర్యమేసింది. సాధారణంగా విప్లవకారులు, ఎర్ర జెండా మీద, వాళ్ల సహచరుల అమరత్వం మీద పాటలు రాస్తారు. కానీ ఈ పాట మానవ ఎవల్యూషన్‌మీద, అందులో మార్పుమీద, ఆ మార్పుతెచ్చే వ్యక్తుల మీద రాసింది. ఈమధ్య మిత్ర తెలంగాణమీద చాలా పాటలు రాశాడు. విమలక్క పాడింది. ‘చలనమే జీవంగా.. జీవమే పరిణామంగా.. వృక్షజాతి జంతుజాతి పరస్పరాధారంగ...చెట్టుమీద వానరం..
నేలచేరిన తరుణం... శ్రమతోనే నరవానర పరిణామం.. మనుగడ పోరాటంలో ఆచరణే జ్ఞానమంటు’ ఈ పాటలో నర–వానర సంబంధం, పరిణామక్రమం చాలా చక్కగా చెప్పడంతో పాటకు నిరంతర జీవితం మార్పు గురించి చెప్పింది. విమల ఈ పాటకు పూర్తి ప్రాణం పోసింది.
విప్లవోద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో...
అయితే పాటలో ఆర్యుల రాకతో సొంత ఆస్తి పుట్టిందనే లైను ఉంది. నిజానికి స్వయం ఆస్తి హరప్ప నగర నిర్మాణం నాటికే ఉంది. ఆర్యులొచ్చాక ఆస్తికుల
మయం చేయడమైనది. ఆర్యులు ఆస్తిని వర్ణ వ్యవస్థకు లింక్ చేశారు. తెలంగాణలో లెఫ్ట్ ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఒక స్త్రీ కళాకారిణి విమలక్కలాగ ఎవరూ ఎదగలేదు. ఎదిగినా లెఫ్ట్ గ్రూపులుగాని, పార్టీలుగాని సుదీర్ఘకాలం స్త్రీలను కళారంగంలో రాణించనివ్వలేదు. ఈ గ్రూపు విమలక్కకు ఇచ్చిన మద్దతు, దాన్ని ఉపయోగించుకుని ఉద్యమ ఆశయంతో ఆమె ఒక టీంతో కళారంగాన్ని నడిపిన పద్ధతి, చరిత్రలో మరో స్త్రీ కళాకారిణి లేదు. అటు విప్లవోద్యమంలో, ఆ తరువాత తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ వచ్చాక బతుకమ్మ పండుగ ప్రచారం కోసం ఆమె చాలా కృషి చేసింది. చాకలి ఐలమ్మ తరువాత ఒక కురుమ కులంలో అదే పాత నల్లగొండ జిల్లాలో పుట్టి మార్పును ఆశించి, జీవితాంతం పనిచేసి ఇంకా
ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్న స్త్రీ ఈమె ఒక్కతే.
ఐలమ్మ తరువాత విమలక్క..
భారతదేశపు కమ్యూనిస్టు పార్టీల్లో, లేదా విప్లవ గ్రూపుల్లో సిద్ధాంత నిర్మాణ రంగంలో స్త్రీలను ఎదగనివ్వలేదు. మహిళా సంఘాలు, సాయుధ పోరాటాన్ని నమ్మినవాళ్లు, దళాల్లో స్త్రీలను చేర్చుకున్నారు. వారు తుపాకి పోరాటాలు చేశారు. చనిపోయారు. కానీ సిద్దాంత నిర్మాణ నాయకురాళ్లులాగ ఎవరూ ఎదగలేదు. విమలక్క పనిచేసే గ్రూపుల్లో కూడా ఆమె సిద్ధాంత నిర్మాణ నాయకత్వం స్థాయి ఏమిటో ఎవరికీ తెలియదు. ఆ గ్రూపు రిప్రజెంటేటివ్‌గా రాష్ట్రానికి పరిచయమున్న మగ నాయకులు కూడా ఆమె సిద్ధాంత నిర్మాణ నాయకత్వం స్థాయి ఏమిటో ఎవరికీ తెలియదు.
కానీ ఆ గ్రూపు రిప్రజెంటేటివ్‌గా రాష్ట్రానికి పరిచయమున్న మగ నాయకులు కూడా ఎవ్వరూ లేరు. ఆమెనే దానికి ప్రతినిధిగా ప్రజల మధ్య ప్రాచుర్యం పొందింది. నూతన ప్రతిపాదనలతో అసలు మొత్తం కమ్యూనిస్టు నిర్మాణాల్లో బాగా ప్రాచుర్యం పొందిన సిద్ధాంత ఆచరణ పుస్తకాలు రాసిన మగ నాయకులు కూడా లేరు. అందువల్ల యూనివర్సిటీల్లో, కాలేజీల్లో రచయితల మధ్య మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావోల రచనలు తప్ప బాగా చర్చించే రచనలు ఈ దేశంలో రాసినవి లేవు. అందుకే ఈ నిర్మాణాల్లో కొత్త ఆలోచనలు పుట్టుక రాలేదు. ఇటువంటి క్రియేటివ్ రచనల శూన్య దశలో విమలక్క పాడిన ‘ఎవరో ఒకరు, ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్లీ...మళ్లీ’ పాట చాలా క్రియేటివ్‌గా ఉంది. చాకలి ఐలమ్మ తరువాత తెలంగాణకు విమలక్క ఈ దశ సింబల్. అందుకే వారి రాజకీయ ఆచరణలతో ఎన్ని విభేదాలు ఉన్నా ఆమె చరిత్ర కోసం ఈ వ్యాసం రాశాను.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
