బాల్క సుమన్.. నోరు అదుపులో పెట్టుకో..మంత్రి వివేక్‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: ఎంపీ వంశీకృష్ణ

బాల్క సుమన్.. నోరు అదుపులో పెట్టుకో..మంత్రి వివేక్‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: ఎంపీ వంశీకృష్ణ
  • కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసం వివేక్‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
  • మహిళలపై అరాచకాలు, ఇసుక, భూదందాలు తప్ప 
  • నువ్వు ఒరగబెట్టిందేమీ లేదు 
  • చెన్నూరు అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాల కోసం మంత్రి వివేక్ కృషి చేస్తున్నారని వెల్లడి

కోల్​బెల్ట్, వెలుగు: కేసీఆర్, కేటీఆర్ మెప్పు పొందేందుకు బాల్క సుమన్ మంత్రి వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా వైఖరి మార్చుకోకుండా, ఫ్రస్టేషన్‌‌‌‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ మేరకు శనివారం ఎంపీ వంశీకృష్ణ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కేసీఆర్ ఇంట్లో పనులు చేయడానికి పిలవడం లేదనే నిరాశలోనే సుమన్ ఇలాంటి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 

ఎంపీగా, ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న సమయంలో బాల్క సుమన్ ప్రజలను పట్టించుకోలేదని, అందుకే ఆయనను ఓడించి బుద్ధి చెప్పారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని పేర్కొన్నారు. సింగరేణి భవనాన్ని కాలబెట్టాలి, రైల్వే పట్టాలు కోయాలి, కేసులు పైన వేసుకోవాలంటూ బాల్క సుమన్​ యువతను రెచ్చగొట్టడం, పోలీస్​ఆఫీసర్లపై దాడులు చేస్తామని మాట్లాడడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే యువతను రెచ్చగొడుతూ వారి భవిష్యత్‌‌‌‌తో చెలగాటం ఆడే విధానాలని కేటీఆర్, సుమన్​ మానుకోవాలని సూచించారు. 

చిల్లర మాటలు మాట్లాడొద్దు..

ఆపద వస్తే కాళ్లు మొక్కడం, ఆ తర్వాత చిల్లర మాటలు మాట్లాడడం, అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టడం సుమన్‌‌‌‌కు వెన్నతో పెట్టిన విద్య అని వంశీకృష్ణ ఎద్దేవా చేశారు. మహిళాలపై అరాచకాలు, ఇసుక, భూదందాలు, సింగరేణి దందాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడం, సెటిల్‌‌‌‌మెంట్లు చేయడం తప్ప సుమన్ ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలకు సంబంధించిన వీడియోలను మరోసారి ప్రజలు ముందు ఉంచాల్సిన పరిస్థితిని తెచ్చుకోవద్దని హితవు పలికారు. 

తెలంగాణ యువతకు విద్య, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంత్రి వివేక్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, అలాంటి నాయకుడిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధిపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలన్నారు. ‘‘కేటీఆర్.. నీ పిల్లలు మాత్రమే మంచి స్కూళ్లలో చదవాలా? అమెరికా, దుబాయికి పోవాలా, తెలంగాణ పిల్లలు జర్మనీ, జపాన్, అమెరికా వంటి దేశాలకు వెళ్లి చదువుకోవద్దా?  అని ప్రశ్నించారు.