- అన్ని వర్సిటీల విద్యార్థి జేఏసీలతో భేటీలు..
- సలహాల స్వీకరణకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యవస్థ
- అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ
- ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయం
- మీడియాకు వివరాలు వెల్లడించిన కేకే,
- పొన్నం ప్రభాకర్, కోదండరాం, అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి పోరాట యోధుడిని రాజకీయాలకతీతంగా, ఎలాంటి వివక్ష లేకుండా గుర్తించి ఆదుకుంటామని ఉద్యమకారుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యమకారులకు విధివిధానాల ప్రకారం సముచిత గౌరవం కల్పించడంతో పాటు, రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీలతో భేటీలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతామని ప్రకటించింది.
ప్రజలు, మేధావుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా త్వరలోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. గురువారం సెక్రటేరియెట్లో ఉద్యమకారుల కమిటీ చైర్మన్ కే.కేశవరావు, సభ్యులు పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, ఇతర సభ్యులు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యమ శక్తులన్నింటినీ కలుపుకుంటూ సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.
ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకోసం కే.కేశవరావు చైర్మన్‌గా సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గురువారం జరిగిన రెండో సమావేశానికి గుర్తింపు పొందిన అన్ని పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులను ఆహ్వానించామని.. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రతినిధులు కూడా సమావేశానికి వచ్చారన్నారు. వారంతా ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపి... విలువైన సలహాలు అందించారన్నారు. ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అన్ని వర్గాలను కలుపుకుపోతామని పొన్నం తెలిపారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేస్తం: కేకే
కమిటీ సభ్యులందరికీ ఉద్యమంతో విడదీయరాని సంబంధం ఉందని చైర్మన్ కే. కేశవరావు అన్నారు. ఉద్యమకారుల భావోద్వేగాలు తమకు బాగా తెలుసన్నారు. కేవలం మలిదశే కాకుండా, తొలి దశ (1969) ఉద్యమకారులను కూడా గుర్తించి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పరిభాషలో ఆల్ పార్టీ మీటింగ్ అంటే గుర్తింపు పొందిన పార్టీలే అవుతాయన్నారు. కానీ తమ ఉద్దేశం అది కాదన్నారు. గుర్తింపు ఉన్న, లేని అన్ని రాజకీయ పక్షాలను, ముఖ్యమైన గ్రూపులను సంప్రదిస్తామన్నారు.
పూర్తిస్థాయిలో ప్రతి ఒక్కరి ప్రాతినిధ్యం ఉండేలా చూస్తామన్నారు. స్వరాష్ట్ర సాధన ఒకెత్తు అయితే, రాష్ట్ర పునర్నిర్మాణం మరొక ఎత్తు అని కేశవరావు వ్యాఖ్యానించారు. పునర్నిర్మాణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గతంలో కొందరు తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉండి ఉండవచ్చన్నారు. అటువంటి వారిని కూడా సంప్రదిస్తామన్నారు. అవసరమైతే గేటు బయట కూర్చుని అయినా వారితో మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. త్వరలోనే అడ్వకేట్లు, డాక్టర్లతో కూడా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీల నేతలు అభినందించారని తెలిపారు.
నాలుగు ప్రతిపాదనల పరిశీలన: అద్దంకి దయాకర్
ప్రస్తుతం ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ సంప్రదింపుల దశలోనే ఉందని కమిటీ మరో ప్రతినిధి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్న్నారు. దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, జర్నలిస్టులు, కళాకారులు, రచయితలు, దేశవిదేశాల్లో పోరాటం చేసిన వారి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. 1969 ఉద్యమంతో పాటు 1947 సాయుధ పోరాట చరిత్రను కూడా రికార్డు చేయాలని కొందరు సూచించారన్నారు.
ప్రస్తుతం నాలుగు ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోందన్నారు. మొదటిది అమరుల కుటుంబాలను గుర్తించడం. రెండోది క్షతగాత్రులను గుర్తించడం. మూడోది పోలీస్ కేసులు ఎదుర్కొన్నవారిని గుర్తించడం. నాలుగోది ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న స్వతంత్ర మేధావులను గుర్తించడమని వివరించారు. ప్రతిపాదనల ఆధారంగా తగిన విధివిధానాలు తయారుచేస్తామన్నారు. భవిష్యత్తులో ఎవరైనా నేరుగా చైర్మన్ ను కలిసి తమ దరఖాస్తులను, వారు గుర్తించిన ఉద్యమకారుల జాబితాలను సమర్పించేందుకు తగిన సమయం, ప్రత్యేక తేదీలను కేటాయిస్తామని స్పష్టం చేశారు.
ఉద్యమకారుల బాధలను వింటం.. తోవ చూపిస్తం: కోదండరాం
రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ సహా అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీలతో సమావేశాలు నిర్వహిస్తామని కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు తమ యవ్వనాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము ఏంచేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నామని విద్యార్థులు అంటున్నారన్నారు. తమ బాధలను వినాలని, తోవ చూపాలని వారు కోరుతున్నారన్నారు. విద్యార్థుల సమస్యలను ఆలకించి, వారికి తగిన మార్గం చూపేలా భేటీలు జరుపుతామని హామీ ఇచ్చారు.
