- అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ సిబ్బందికి పొంగులేటి ఆదేశాలు
- అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచన
- జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: చత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ప్రతిక్షణం అలర్ట్‌గా ఉండాలని రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాగులు, వంకలు, జలాశయాల వద్ద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రభావిత ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లు, పోలీస్, మున్సిపల్, నీటిపారుదల, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. రాజధాని హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రవాణా, తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణమే సహాయక చర్యలు అందించేలా ప్రత్యేక బృందాలను రెడీగా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్.. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ జారీ చేయగా, కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు
సెక్రటేరియెట్‌లో కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ, ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, జలాశయాలు, వాటర్ ఫాల్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు ఆంక్షలు విధించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 249 ప్రమాదకర జలాశయాలు ఉన్న స్పాట్లను, మరో 167 పర్యాటక ప్రాంతాలను గుర్తించి పర్యాటకులు వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని, సహాయక చర్యల కోసం 12 కంపెనీల ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపశాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ సూచించారు. ప్రతి జిల్లాలో రెస్క్యూ సిబ్బంది, రెస్క్యూ పరికరాలు, పడవలు, డీ-వాటరింగ్ పంపులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర అత్యవసర ప్రతిస్పందన వనరులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
