- రీకౌంటింగ్, వెరిఫికేషన్‌కు 7 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం హైదరాబాద్‌లోని విద్యాశాఖ కార్యాలయంలో టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి, జేడీ సోమిరెడ్డితో కలిసి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.telanganaopenschool.org లో చూసుకోవచ్చని అధికారులు సూచించారు. టెన్త్‌లో మొత్తం 36,863 మంది పరీక్ష రాయగా 26,542 మంది (72 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఇందులో అబ్బాయిలు 66.41 శాతం మంది ఉండగా, అమ్మాయిలు 77.88 శాతం మంది ఉన్నారు. ఇంటర్‌లో 54,679 మందికి 37,562 మంది (68.70 శాతం) పాసయ్యారు. అబ్బాయిలు 63.90 శాతం, అమ్మాయిలు 73.76 శాతం ఉత్తీర్ణత సాధించారు. నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో గతేడాదితో పోలిస్తే 40వేల అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి టాస్ మెమోలు కూడా మీసేవా ద్వారా ఇవ్వాలనే ఆలోచన ఉందని చెప్పారు.
జూన్ 4 నుంచి వెబ్ మెమోలు
అభ్యర్థులు మార్కుల మెమోలను జూన్ 4 నుంచి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డైరెక్టర్ పీవీ శ్రీహరి వెల్లడించారు. మెమోల్లో పేరు, ఫొటో లేదా ఇతర వివరాల్లో తప్పులుంటే జూన్15వరకు ఆయా జిల్లాల డీఈఓలు లేదా హెడ్మాస్టర్ల ద్వారా సరిచేయించుకోవాలని సూచించారు. రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కమ్ ఫొటోకాపీ సదుపాయం కల్పించారు. జూన్ 2 నుంచి 7వరకు ఆన్‌లైన్ ద్వారా లేదా మీ-సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ. 350, రీ-వెరిఫికేషన్‌కు రూ.1200 కట్టాలి. ఇంటర్ విద్యార్థులు రీకౌంటింగ్‌కు రూ. 400, రీ-వెరిఫికేషన్‌కు రూ. 1200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
