పంచాయతీ కార్యదర్శుల సమస్యలు తీర్చండి..మంత్రి సీతక్కకు తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ వినతి

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు తీర్చండి..మంత్రి సీతక్కకు తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ వినతి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షడు శ్రీకాంత్ గౌడ్ నేతృత్వంలో పలువురు సెక్రటరీలు మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు.  మంగళవారం ప్రజాభవన్​లో ఆమెతో సమావేశమయ్యారు. పెండింగ్ లో ఉన్న పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని ఆమెకు వినతిపత్రం అందించారు. ఔట్ సోర్సింగ్ సెక్రటరీల కన్వర్షన్, ఓపీఎస్ లకు పది నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. ప్రొబేషనరీ పీరియడ్ డిక్లరేషన్ పై నిర్ణయం తీసుకోవాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క– సారక్క తల్లులను దర్శించుకోవాలని సూచించారు. మేడారంలో విధుల్లో ఉన్న ఉద్యోగులంతా జాతరను సక్సెస్‌‌ చేయాలన్నారు. అనంతరం పీఆర్, ఆర్డీ డైరెక్టర్ శ్రుతి ఓజాను కలిసి పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందించారు.