- సాక్షులుగా బాధిత ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసిన సిట్
- వాంగ్మూలం ఇచ్చిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేసే క్రమంలో బాధిత ప్రజాప్రతినిధుల వాంగ్మూలాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు మొదట ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్టేట్‌మెంట్లను సోమవారం రికార్డు చేసింది. సిట్ పిలుపు మేరకు ఈ ముగ్గురు నేతలు సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరయ్యారు.
కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ ఆధారాలు చూపినట్లు సమాచారం. టెలికం సర్వీసెస్ నుంచి సేకరించిన ట్యాపింగ్ లిస్ట్‌లోని ఫోన్ నంబర్లను సిట్ అధికారులు చూపినట్లు సమాచారం. ఆయా నంబర్లు, ట్యాపింగ్ చేసిన తేదీల్లో అనుమానిత ఘటనలకు సంబంధించి సాక్షులుగా స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసినట్లు తెలిసింది.
ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని శిక్షించాలి: యెన్నం
సిట్ విచారణ అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సిట్ పిలుపు మేరకు అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చామన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని, సూత్రధారులు ఎవరో తేలాలని గతంలోనే తాను ఫిర్యాదు చేశానని గుర్తుచేశారు. తనతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదులు చేశారని ఆయన తెలిపారు. ట్యాపింగ్ కేసులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కోసం పోలీసులు పిలిచారని చెప్పారు. సిట్ అడిగిన ప్రశ్నలకు అనుగుణంగా వాంగ్మూలం ఇచ్చామన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం స్వార్థంతో బీఆర్‌ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని మండిపడ్డారు. ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారందరికీ శిక్ష పడాలన్నారు.
