డెడ్ బాడీల తరలింపునకు జిల్లాకో వెహికల్..గాంధీ, ఉస్మానియా నుంచి మృతదేహాల తరలింపునకు సర్కార్ కసరత్తు

డెడ్ బాడీల  తరలింపునకు జిల్లాకో వెహికల్..గాంధీ, ఉస్మానియా నుంచి మృతదేహాల తరలింపునకు సర్కార్ కసరత్తు
  • దూరంగా ఉన్న జిల్లాలకు ప్రత్యేకంగా పార్థీవ వాహనాల కేటాయింపునకు పరిశీలన
  • సరిపడా ఫ్రీ హీర్స్ వెహికల్స్ లేక ప్రైవేట్ లో 30 వేలు ఖర్చు చేసి తీసుకెళ్తున్న పేదలు
  • మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యేల వినతితో ప్లాన్ చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ

హైదరాబాద్, వెలుగు: గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎంఎన్‌‌‌‌జే   హాస్పిటల్స్ నుంచి మృతదేహాలను సొంత ఊర్లకు తరలించడానికి  వెహికల్స్​ కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  హైదరాబాద్ కు దూరంగా ఉండే ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, భద్రాచలం, ఖమ్మం తదితర జిల్లాలకు ప్రత్యేకంగా ఒక ఫ్రీ హీర్స్ (ఉచిత మృతదేహ రవాణా) వెహికల్ ను కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నది.

ఇటీవల పలు జిల్లాల ఎమ్మెల్యేలు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి  దామోదర రాజనర్సింహను కలిసి, తమ ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీంతో స్పందించిన మంత్రి.. ఏ జిల్లాకు చెందిన మృతదేహాన్ని ఆ జిల్లాకు కేటాయించిన వాహనంలోనే, ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేదా పైరవీలు అవసరం లేకుండా ఉచితంగా తరలించేలా కొత్త రూల్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది. అవసరమైతే రద్దీ ఎక్కువగా ఉండే జిల్లాలకు ఒకటి కంటే ఎక్కువ వెహికల్స్ ను కూడా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

ప్రైవేట్ లో అడ్డగోలు దోపిడీ.. 

ప్రస్తుతం సిటీలోని పెద్ద హాస్పిటల్స్ వద్ద ప్రభుత్వం తరఫున మృతదేహాల తరలింపు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ వాహనాలు ఉన్నా, అవి సరైన మెయింటెనెన్స్ లేక సగానికి పైగా షెడ్లకే పరిమితమయ్యాయి. ఒకవేళ వాహనం అందుబాటులో ఉన్నా.. డ్రైవర్ల కొరత, డీజిల్ ఖర్చుల సాకుతో సిబ్బంది కాలయాపన చేస్తుండటంతో, గంటల తరబడి మార్చురీల వద్ద శవాలతో వేచి ఉండలేక బాధితులు ప్రైవేట్ అంబులెన్స్‌‌‌‌లను ఆశ్రయిస్తున్నారు.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ దళారులు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాచలం వంటి దూర ప్రాంతాలకు మృతదేహాలను తీసుకెళ్లడానికి రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న పేద కుటుంబాలు వేరే దారి లేక ప్రైవేట్ దోపిడీకి గురవుతున్నారు. కొన్నిసార్లు ఫ్రీ సర్వీస్ సిబ్బంది కూడా ‘అదనంగా ఇస్తేనే వస్తాం’ అని డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి.

ఎలాంటి పైరవీలు లేకుండా.. 

ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దూర ప్రాంతాల జిల్లాలకు ప్రత్యేకంగా ఒక వెహికల్ కాన్సెప్ట్‌‌‌‌ తో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇకపై సుదూర ప్రాంతాలైన ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి వంటి కొత్త జిల్లాలకు వెళ్లడానికి వాహనం అందుబాటులో లేదు అనే సమాధానం రాకుండా మానిటరింగ్ చేయనున్నారు. ఎలాంటి రాజకీయ పైరవీలు లేకుండా మృతుల బంధువులే నేరుగా అడిగితే..

వెహికల్ అందుబాటులో ఉండేలా నిర్వహణ బాధ్యతలను పటిష్టం చేయడంతో పాటు, డ్రైవర్ల లభ్యతను నిరంతరం పర్యవేక్షించేలా మెకానిజంను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ నిర్ణయం గనుక పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, ప్రైవేట్ అంబులెన్సుల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడటమే కాకుండా.. ప్రాణాలు కోల్పోయిన బాధలో ఉన్న పేద కుటుంబాలకు రవాణా కష్టాలు తప్పనున్నాయి.