ఫ్లై ఓవర్ల కింద విద్యుత్ సబ్‌‌స్టేషన్లు...మానవరహిత నిర్వహణ.. స్థలాభావానికి కొత్త పరిష్కారం

ఫ్లై ఓవర్ల కింద విద్యుత్ సబ్‌‌స్టేషన్లు...మానవరహిత నిర్వహణ.. స్థలాభావానికి కొత్త పరిష్కారం
  •     5 సబ్‌‌ స్టేషన్లపై విద్యుత్ భారం తగ్గించేలా ప్రభుత్వం కార్యాచరణ
  •     ముషీరాబాద్‌‌లో 33/11 కేవీ మోడల్ ఇండోర్ సబ్‌‌స్టేషన్‌‌ ఏర్పాటుకు సదరన్‌‌ డిస్కమ్‌‌ ప్రణాళిక
  •     స్టీల్ ఫ్లై ఓవర్ కింద స్థలాన్ని పరిశీలించిన సీఎండీ జితేశ్‌‌ వీ పాటిల్

హైదరాబాద్, వెలుగు: కొత్త సబ్‌‌స్టేషన్ల నిర్మాణానికి ఎదురవుతున్న స్థలాభావ సమస్యకు వినూత్న పరిష్కారం చూపే దిశగా సదరన్​ డిస్కమ్​ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌‌లో ఫ్లై ఓవర్ల కింద విద్యుత్​ సబ్‌‌స్టేషన్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం.. మానవరహిత నిర్వహణ లక్ష్యంగా ఈ ఇండోర్ సబ్‌‌స్టేషన్‌‌ ఏర్పాటుకు నిర్ణయించింది. నగరంలో సాంకేతికంగా అనువైన ఫ్లై ఓవర్లు, స్టీల్ బ్రిడ్జిల కింద అందుబాటులో ఉన్న స్థలాలను వినియోగించి ఆధునిక కాంపాక్ట్ ఇండోర్ సబ్‌‌స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగానే ముషీరాబాద్​ ఫ్లై ఓవర్​ కింద సుమారు రూ.10 కోట్ల ప్రభుత్వ నిధులతో 33/11 కేవీ మోడల్ సబ్‌‌స్టేషన్‌‌ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. సోమవారం సదరన్​ డిస్కమ్​ సీఎండీ జితేశ్‌‌ వీ పాటిల్​ స్టీల్ బ్రిడ్జి కింద స్థలాన్ని పరిశీలించారు.

 ఐదుగురు కమిటీ సభ్యులతో అధ్యయనం

గ్రేటర్ హైదరాబాద్‌‌లో నిరంతరం పెరుగుతున్న విద్యుత్ లోడ్‌‌ను అరికట్టాలంటే కొత్త విద్యుత్​ సబ్​ స్టేషన్లు నిర్మించాల్సి ఉన్నది. అయితే, నగరంలోని కీలక ప్రాంతాల్లో అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడం, భూముల విలువ అధికంగా ఉండటంలాంటి అంశాలు కొత్త సబ్‌‌స్టేషన్ల నిర్మాణంలో ప్రధాన సవాళ్లుగా మారాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ‘కాంపాక్ట్​ ఇండోర్​ సబ్​ స్టేషన్​’ విధానాన్ని అమలు చేయాలని సదరన్​ డిస్కమ్‌‌ భావించింది. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్​ ప్రాజెక్ట్స్​ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి.. ఇండోర్​ నిర్మాణ విధానం, నిర్వహణ, భద్రత, సాంకేతిక అనుకూలత తదితర అంశాలపై  అధ్యయనం చేయించింది. సాంకేతికంగా అనుకూలమైన ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల కింద అందుబాటులో ఉన్న స్థలాలను ఇండోర్ సబ్‌‌స్టేషన్ల నిర్మాణానికి వినియోగించవచ్చని కమిటీ సిఫారసు చేసింది. వీటి ఆధారంగా నగరంలో భూమి అందుబాటులో లేని ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలను గుర్తించే ప్రక్రియను సంస్థ చేపట్టింది.

ముషీరాబాద్‌‌లో 33/11 కేవీ  మోడల్ ఇండోర్ సబ్‌‌స్టేషన్‌‌.. 

గ్రేటర్​హైదరాబాద్‌‌లో మొదటగా ముషీరాబాద్‌‌లో 33/11 కేవీ ఇండోర్ సబ్‌‌స్టేషన్‌‌ను రెండు 8 ఎంవీఏ పవర్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. సబ్‌‌స్టేషన్‌‌లో మొత్తం 11 కేవీ ఫీడర్లకు అవసరమైన 8 ఇండోర్ స్విచ్‌‌గేర్లు ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో నాలుగు, భవిష్యత్తులో పెరిగే విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో నాలుగు 11 కేవీ ఫీడర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జవహర్‌‌నగర్, విద్యానగర్, బౌధ్‌‌నగర్–ఎల్‌‌ఎన్ నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఫీడర్లలో అవసరమైన వాటిని చేసి.. కొత్త సబ్‌‌స్టేషన్‌‌కు అనుసంధానించేలా ప్రతిపాదనలు రూపొందించారు. 

సబ్‌‌స్టేషన్లపై తగ్గనున్న భారం

ప్రతిపాదిత ఇండోర్ సబ్‌‌స్టేషన్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం అధిక లోడ్‌‌తో పనిచేస్తున్న ఐదు 33/11 కేవీ సబ్‌‌స్టేషన్లపై అదనపు విద్యుత్ భారం తగ్గుతుందని విద్యుత్​ శాఖ ఇంజినీర్లు తెలిపారు. ముషీరాబాద్​ ఇండోర్​ సబ్‌‌స్టేషన్‌‌కు రెండు వైపుల నుంచి 33 కేవీ విద్యుత్​ సరఫరాకు ఏర్పాట్లు చేశారు. సబ్‌‌స్టేషన్‌‌కు ప్రధాన విద్యుత్ సరఫరాను ఫీవర్ హాస్పిటల్ దగ్గరల్లో ఉన్న132/33 కేవీ ఈహెచ్‌‌టీ  సబ్‌‌స్టేషన్​ నుంచి 1.5 కిలో మీటర్లు 33 కేవీ అండర్‌‌గ్రౌండ్ కేబుల్ ద్వారా తీసుకురావాలని ప్రతిపాదించారు. ప్రత్యామ్నాయ సరఫరాను చిలకలగూడ–నారాయణగూడ 33/11 కేవీ ఇండస్ట్రియల్ ఏరియా సబ్‌‌స్టేషన్‌‌కు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇండోర్ సబ్‌‌స్టేషన్‌‌ను మానవరహిత సబ్‌‌స్టేషన్‌‌గా నిర్వహించేందుకు ప్రణాళికలు చేశారు. 

రూ.8 కోట్ల నుంచి 10 కోట్లు మిగులు: సీఎండీ జితేశ్‌‌

ఇండోర్​ సబ్‌‌స్టేషన్ల నిర్మాణంతో రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల నిధులు మిగలనున్నాయని సదరన్​ డిస్కమ్​ సీఎండీ జితేశ్‌‌ వీ పాటిల్​ తెలిపారు. సోమవారం ఆయన ముషీరాబాద్‌‌లో నిర్మించే ఇండోర్​ సబ్‌‌స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ‘‘ఇక్కడ సబ్‌‌షన్​నిర్మాణానికి సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఖర్చవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొత్త సబ్‌‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేయాల్సి వస్తే ప్రాంతాన్ని బట్టి స్థల కొనుగోలుకే రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యయం చేయాలి. 

ఫ్లై ఓవర్ల కింద అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను సాంకేతికంగా పరిశీలించి వినియోగించడం ద్వారా భూసేకరణ వ్యయాన్ని తగ్గించడంతోపాటు నగరంలో స్థల కొరతకు కూడా ప్రత్యామ్నాయ పరిష్కారం లభిస్తుంది. తక్కువ స్థలంలో ఆధునిక విద్యుత్ మౌలిక వసతులను అభివృద్ధి చేసి, వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించవచ్చు’’ అని వివరించారు.