‘జర్మనీ భాష’పై పట్టు..  కొలువు కొట్టు..ఆ భాష వస్తే వంద శాతం ఉద్యోగం గ్యారెంటీ

‘జర్మనీ భాష’పై పట్టు..  కొలువు కొట్టు..ఆ భాష వస్తే వంద శాతం ఉద్యోగం గ్యారెంటీ
  • స్టేట్ స్టూడెంట్లకు ఆ దేశంలో  ట్యూషన్ ఫీజులూ ఫ్రీనే 
  • జర్మనీ పర్యటనలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు 
  • ఇంజినీరింగ్ ఫస్టియర్ నుంచే జర్మన్ భాషపై పట్టుకు చర్యలు
  • పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా లాంగ్వేజ్ కోచింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు విదేశాల్లో లక్షల రూపాయల జీతంతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది. కేవలం డిగ్రీ పట్టాలతో సరిపెట్టకుండా, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న భాషలపై పట్టు సాధిస్తే విదేశీ కొలువులు సులభంగా సాధించవచ్చని గుర్తించింది. ఇందులో భాగంగా జర్మనీ, జపాన్, దక్షిణ కొరియాలాంటి దేశాల్లో పెరుగుతున్న ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను రెడీ చేయాలని నిర్ణయించింది.

దీనికి తగ్గట్టుగానే ఈ ఏడాది నుంచి జర్మన్ లాంగ్వేజీలు నేర్పించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్దం చేస్తోంది. విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో రాష్ట్రం నుంచి విద్యాశాఖ బృందం జూన్ 28 నుంచి జులై 6 వరకు జర్మనీ స్టడీ టూర్​కు వెళ్లొచ్చింది. ఈ సందర్భంగా 5 యూనివర్సిటీలను సందర్శించి, వాటితో 18 అవగాహన  ఒప్పందాలు కుదర్చుకున్నారు.

ఈ క్రమంలో పలు పబ్లిక్ సెక్టార్ వర్సిటీలు తెలంగాణతో అవగాహనకు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే, దీనికి వారు ఓ కండిషన్ పెట్టారు. అక్కడి వర్సిటీల్లో జర్మన్ భాషలో మాస్టర్ డిగ్రీ చేస్తే.. ట్యూషన్ ఫీజులో వందశాతం రాయితీ  ఇవ్వనున్నట్టు ప్రకటించారు. జర్మన్ భాష నేర్చుకుంటే అక్కడ 95శాతం నుంచి వంద శాతం ఉద్యోగం గ్యారెంటీ ఉంటుందని వర్సిటీలు ప్రకటించాయి.

పలు సంస్థలతో ఒప్పందాలు..

తెలంగాణ యువతకు గ్లోబల్ అవకాశాలు అందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆశయానికి  తగ్గట్టుగా జర్మనీలో స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్​ ప్రోగ్రామ్స్, డ్యూయల్ డిగ్రీలు, ఇంటర్న్‌‌షిప్‌‌లపై పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రధానంగా సైన్స్ అండ్‌‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సులను జర్మనీ నిబంధనలకు తగ్గట్టుగా మార్చడం ద్వారా మన విద్యార్థులకు అక్కడ సులభంగా గుర్తింపు లభించనుంది. ఉమ్మడి పరిశోధనలు, పేటెంట్లు సాధించడంపై కూడా ఈ పర్యటనలో ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి తగ్గట్టుగా రాష్ట్రంలోని ఐఐటీ హైదరాబాద్, ఐఎస్‌‌బీలాంటి సంస్థల సహకారంతో సిలబస్‌‌ను మారుస్తున్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యావిధానంలో మార్పులు చేయనున్నారు. 

ఫస్టియర్ నుంచే... 

ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న జర్మనీలో అక్కడి భాష నేర్చుకోవడంతో మన విద్యార్థులు అక్కడ అద్భుతమైన కెరీర్ నిర్మించుకోవచ్చని గుర్తించిన ప్రభుత్వం.. ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫస్టియర్ నుంచే జర్మన్ లాంగ్వేజీ నేర్పించేలా విద్యాశాఖ ప్లాన్ రెడీ చేస్తోంది. దీనికోసం అయ్యే ఖర్చులనూ ప్రభుత్వం భరించాలని డిసైడ్ అయింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇటీవలే ప్రారంభించిన జర్మన్ భాష సబ్జెక్టును ఈ విద్యార్థులకు అందించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, పాలిటెక్నిక్ పూర్తయిన వారికీ ఓపెన్ వర్సిటీ ద్వారా స్పెషల్‌‌గా కోర్పు నేర్పించాలని అధికారులు భావిస్తున్నారు

ఇంజినీరింగ్‌‌లో కొత్త విధానం.. 

జర్మనీ వెళ్లేందుకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులను అందుబాటులోకి తేవాలని విద్యాశాఖ భావిస్తోంది. దీంట్లో 3+2తో పాటు, 3+ 1+ 1 విధానంలో చదువులు చెప్పించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూడేండ్ల ఇంజినీరింగ్ కోర్సు తెలంగాణలో పూర్తి చేసి.. ఆ తర్వాతి రెండేండ్లు జర్మనీలో పూర్తి చేసేలా అక్కడి వర్సిటీలతో ఎంవోయూలు కుదుర్చుకుంటున్నారు. డిగ్రీలోనూ ఇదే విధానం అమలు చేయాలని యోచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సర్కారుకు ప్రిలిమినరీ ప్రపోజల్స్ అందించిన విద్యాశాఖ.. త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను  అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది