లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటున్నం   : పోలీసు శాఖ

లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటున్నం   : పోలీసు శాఖ
  • పునరావాసం కల్పిస్తున్నం: పోలీసు శాఖ

హైదరాబాద్, వెలుగు: అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో స్థిరపడే దిశగా అండగా నిలుస్తున్నామని డీజీపీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నామని తెలిపింది. 1980లో పీపుల్స్ వార్ (ప్రస్తుత సీపీఐ–మావోయిస్ట్) పార్టీ ఆవిర్భావం తరువాత నుంచి గత ఏడాది చివరి వరకు 576 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారని తెలిపింది. వీరికి పునరావాస ప్యాకేజీ కింద స్వగ్రామాల్లో నివాస ధ్రువపత్రాలు ఇప్పించి, ఆధార్  నమోదు చేయిస్తున్నామని చెప్పింది.

వీటి ద్వారా పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు తెరిపించి, రివార్డు సొమ్మును అదే ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొంది. స్థానిక రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి అవకాశం ఉన్నవారికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని వెల్లడించింది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా జనజీవనంలోకి రావాలని డీజీపీ శివధర్​ రెడ్డి పిలుపునిచ్చారు.