- మంజీరా, పాకాల, పోచారం, కిన్నెరసానికి
- ‘రాంసార్’ రికగ్నిషన్ కోసం సన్నాహాలు
- ప్రతిపాదనలు రెడీ చేసిన అటవీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక, పర్యావరణ కేంద్రాలైన మంజీరా, పాకాల, పోచారం, కిన్నెరసాని వంటి చిత్తడి నేలలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు అటవీ శాఖ సన్నాహాలు చేస్తోంది. వీటిని ‘రాంసార్’ సైట్లుగా గుర్తించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా సోమవారం అరణ్య భవన్‌లో అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) డాక్టర్ సి.సువర్ణ అధ్యక్షతన ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. చిత్తడి నేలల ప్రాధాన్యతను వివరిస్తూ అధికారులు పలు విషయాలను పంచుకున్నారు. అడవుల కన్నా ఎక్కువగా చిత్తడి నేలలు కార్బన్‌ను నిల్వ చేయగలవని, గ్లోబల్ వార్మింగ్ నియంత్రణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
నీటిని సహజంగా శుద్ధి చేయడం, భూగర్భ జలాలను పెంచడం, జీవవైవిధ్యానికి కేంద్రాలుగా నిలవడం వీటి ప్రత్యేకత అని వివరించారు. చిత్తడి నేలల సంరక్షణలో తరతరాలుగా వస్తున్న స్థానిక ప్రజల అనుభవాలు, వారి సంప్రదాయ జ్ఞానం ఎంతో ఉపయోగపడుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ కోసం 2017 నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వెట్‌ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో అటవీ శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా, పీసీసీఎఫ్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తుండగా.. జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు పనిచేస్తున్నాయని చెప్పారు. పర్యావరణపరంగా కీలకమైన ప్రాంతాలను గుర్తించి నోటిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్‌లు వినయ్ కుమార్, రత్నాకర్ జౌహరి, సీసీఎఫ్‌లు శరవణన్, క్షితిజ, వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ శంకరన్ తదితరులు పాల్గొన్నారు.
రాంసార్ అంటే..
పర్యావరణపరంగా ప్రాధాన్యత కలిగిన చిత్తడి నేలలను గుర్తించి, వాటిని సంరక్షించేందుకు కుదుర్చుకున్న ఒప్పందమే ‘రాంసార్ కన్వెన్షన్’. ఈ ఒప్పందం ప్రకారం గుర్తించిన ప్రాంతాలకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు, నిధులు, సంరక్షణ లభిస్తాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోని మంజీరా, పాకాల, పోచారం, కిన్నెరసానిలను ఆ జాబితాలో చేర్చడమే లక్ష్యంగా అటవీ శాఖ అడుగులు వేస్తోంది.
