- చంచల్‌గూడలో జైళ్ల శాఖ ‘రిట్రీట్-2026’
హైదరాబాద్, వెలుగు: జైళ్లు కేవలం నిర్బంధ కేంద్రాలుగా కాకుండా ఖైదీలను బాధ్యతాయుత పౌరులుగా మార్చి సమాజంలోకి తిరిగి పంపే కేంద్రాలుగా మారాలని మెట్రోపాలిటన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఇందుకోసం ఖైదీలకు నైపుణ్యాభివృద్ధి, ప్రవర్తనా మార్పు, జైలు నుంచి రిలీజ్ తర్వాత సహాయక వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. తెలంగాణ జైళ్లశాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడలోని సికా(స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరెక‌్షనల్ అడ్మినిస్ట్రేషన్)లో మంగళవారం ‘రిట్రీట్-–2026’ను కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనికి జయేశ్ రంజన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జైలు ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్, వైట్-లేబెలింగ్ విధానాలను అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. జైళ్లలో అమలు చేస్తున్న సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఖైదీల సంక్షేమం, మానసిక ఆరోగ్య సమస్యలు.. మాదకద్రవ్యాల వ్యసనాన్ని ఎదుర్కొనే చర్యలు, డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటు అంశాలను వెల్లడించారు.
