- కేంద్ర రక్షణ శాఖ సెక్రటరీకి జితేందర్ రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్– -బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసి దేశ రక్షణ రంగ అభివృద్ధికి ఊతమివ్వాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో ఎంపీ మల్లు రవితో కలిసి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్‌ను ఆయన ఛాంబర్లో కలిసి ఈ విషయంపై చర్చించారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ కారిడార్ ద్వారా హైదరాబాద్‌లోని డిఫెన్స్ హబ్‌లు, బెంగళూరులోని ఏరోస్పేస్ యూనిట్లను కలిపే సమగ్ర పారిశ్రామిక వేదికగా ఇది అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్డీఎల్ ఆధ్వర్యంలో బ్రహ్మోస్ వంటి క్షిపణుల తయారీకి ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ కోసం స్థలాన్ని కేటాయించామన్నారు.
