రాజ్యసభలో అమరావతి బిల్లు: కాళేశ్వరంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి మధ్య వాగ్వాదం

రాజ్యసభలో అమరావతి బిల్లు: కాళేశ్వరంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి మధ్య వాగ్వాదం

రాజ్యసభలో అమరావతి బిల్లుకు చట్టబద్ధతపై 2026 ఏప్రిల్ 02న చర్చజరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అమరావతి బిల్లుపై మాట్లాడుతూ తెలంగాణ విభజన తదనంతర పరిణామాలపై ఎంపీ సురేష్ రెడ్డిమాట్లాడారు. విభజన తీరుపై బీజేపీ తరచుగా విమర్శలు చేస్తోందని ఈ సందర్భంగా అన్నారు. తల్లిని చంపి బిడ్డను తీశారన్నారని.. దీనిపై సమాధానం చెప్పాల్సిన సమయమిదని డిమాండ్ చేశారు.

రాష్ట్రాలు వేరైనా అన్నదమ్ముల్లా కలిసి ఉందామని కేసీఆర్ చెప్పారని సురేష్ రెడ్డి అన్నారు. అమరావతికి కేసీఆర్ మద్ధతు తెలిపారని గుర్తు చేశారు. దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టామని చెప్పారు. తెలంగాణ మండలాలను ఏపీలో విలీనం చేసేటప్పుడు కనీసం చర్చ కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సాయం లేకుండానే కాళేశ్వరం పూర్తి చేశామని అన్నారు. 

ఎంపీ సురేష్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సరేష్ రెడ్డి ఆరోపణలకు సమాధానం చెప్పారు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని నివేదికలు చెప్పాయని.. నిపుణులు కాగ్ నివేదికలోనూ అదే ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపించారు.  కేసీఆర్ ను జైలుకు పంపుతామని కాంగ్రెస్ పదే పదే చెప్పిందని.. అధికారంలోకి వచ్చాక విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. 

 కాళేశ్వరంపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సత్యదూరమని ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు.  2 రాష్ట్రాలను కేంద్రం సమంగా చూడాలన్నారు. మేడిగడ్డ రెండు పిల్లర్లు కూలితే ప్రాజెక్టే పనికిరాదన్నారని గుర్తు చేశారు. దీంతో ఇరువురు నేతల మధ్య  వాగ్వాదం మొదలైంది.