- ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రభావం.. రేపు భారీ వర్షాలు
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పినా.. ఇప్పటివరకు మోస్తరు వానలే పడుతున్నాయి. వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా వేగంగా వీస్తున్నాయి. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముసురు పట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉన్నది.
అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా ఎల్కపల్లిలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా సిర్పూరులో 3.9 సెంటీమీటర్లు, వాంకిడిలో 3.8, ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 3.6, కామారెడ్డి జిల్లా కామారెడ్డిలో 3.4, గాంధారిలో 3.4, ఆదిలాబాద్ జిల్లా బేలలో 3.1, మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లలో 3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా చేగుంటలో 2.6, సిద్దిపేట జిల్లా చీకోడ్లో 2.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. ఇటు హైదరాబాద్లో ఉదయం నుంచి మబ్బు పట్టి ఉన్నా వర్షం పడలేదు. సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత నాలుగైదు రోజులు ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది.
