ఒకే బైక్‌పై ఐదుగురు : వీడియో వైరల్.. ఐదుగురు యువకులు అరెస్ట్

ఒకే  బైక్‌పై ఐదుగురు : వీడియో వైరల్.. ఐదుగురు యువకులు అరెస్ట్

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే పిచ్చి.. ఐదుగురు యువకులను కటకటాల పాలు చేసింది.  మార్చి 29వ తేదీ అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో హైదరాబాద్‌లోని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్తున్న ఒక పల్సర్ బైక్‌పై ఐదుగురు యువకులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించారు. హెల్మెట్ లేకుండా, బైక్ సామర్థ్యానికి మించి ఐదుగురు కూర్చుని ప్రాణాలకు తెగించి ప్రయాణించిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు.. బైక్ నడుపుతున్న వడ్డీ అర్జున్‌తో పాటు అరుపు రోహిత్, చింతకుంట అంజ కుమార్, సిద్ధం కౌశిక్, వల్లపు మురళిని గుర్తించి అరెస్ట్ చేశారు.వీరిపై BNS సెక్షన్ 281, 125 తో పాటు మోటార్ వాహన చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సైఫాబాద్ సిఐ ఎ. సీతయ్య వెల్లడించారు. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించేలా ప్రవర్తించినందుకు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.