హైదరాబాద్, వెలుగు: సూపర్ ఎల్నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ఇరిగేషన్, సివిల్సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరిస్థితి మరింత ముదరకముందే ఇరిగేషన్, వ్యవసాయ శాఖలతో పాటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయన్నారు. రైతులు, ప్రజలపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శనివారం సింపోజియం అనే స్వచ్ఛంద సంస్థ వాతావరణ మార్పులపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణలో ఇప్పటికే క్లైమేట్ చేంజ్ ప్రభావం కనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై వర్షాలపై ఆధారపడే పరిస్థితి ఉండదని, ఇతర నీటి వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో మంచి వర్షాలు పడ్డాయని, రిజర్వాయర్లూ నీటితో కళకళలాడాయని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. వర్షపాత లోటు ప్రభావం ఇప్పటికే తెలుస్తున్నదని పేర్కొన్నారు.
ఇరిగేషన్‌ను రీడిజైన్ చేయాలి
గత వర్షపాతాలు, వాతావరణ పరిస్థితులపై ఆధారపడకుండా భవిష్యత్‌లో ఇరిగేషన్ సిస్టమ్స్‌ను రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నష్టం జరిగాక చర్యలు తీసుకునేకన్నా.. జరగకముందే నివారణ చర్యలు తీసుకోవడం మంచిదన్నారు. ఎన్ని ప్రాజెక్టులు కట్టామన్నది కాదని, క్లైమేట్ చేంజ్‌తో ఎదురయ్యే ప్రభావాల నుంచి రైతులను కాపాడామా లేదా అన్నదే ముఖ్యమన్నా. నీళ్లు కేవలం ఒక వనరు కాదని, ఫుడ్ సెక్యూరిటీ, గ్రామాల స్థిరీకరణ, ఆర్థిక వృద్ధికి సూచిక అని చెప్పారు.
ఇలాంటి కష్టకాలంలో నీటి నిర్వహణలో ఫెయిల్ అయితే.. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కుంటుపడుతుందని, పట్ణణాలకు తాగునీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రగతిపై ప్రభావం పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీకి తాగునీటి సమస్య రాకుండా చూసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం తమ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదేనన్నారు. సిటీకి తాగునీటిని సరఫరా చేసేందుకు గత కొన్ని దశాబ్దాలుగా గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారని గుర్తుచేశారు.
